పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వానిలో సగమున్నవి. లభించినంతవఱకుఁ జాలమనోహరములుగా నున్నవి. మొదట నేను శ్రీపోలవరము సంస్థానాధీశుల సరస్వతీపత్రికకై చెన్నపురి దొరతనము వారి ప్రాచ్యలిఖితపుస్తకభాండాగారములోని పెక్కుతాళపత్రమాతృకలనుండి దీని కొకపుత్రికను వ్రాసి తెచ్చి ప్రకటించితిని. అప్పటికిఁ గృత్యాది పద్యములు లభింపలేదు. నాయుద్యమము నెఱిఁగియున్న బ్రహ్మశ్రీ మానవల్లి రామకృష్ణకవి, ఎం. ఏ., గారు తాము వివిధమండలములలో బహుభాషాగ్రంథపరిశోధనముం గావింప నేగినతరి సంపాదించిన కృత్యాదిపద్యము లెనుబదిమూఁడును బంపిరి. అప్పటికి సరస్వతీపుత్రిక నిల్చిపోయినది. కావునఁ గొంతకాల మాపద్యములు ప్రకటింప నవకాశము లేక పోయినది. కాకినాడలో శతావధానులు తిరుపతిశాస్త్రిగారితనయులయొద్ద భద్రము చేయఁబడిన యీపద్యములను నేనే పరిషత్పత్రికలోఁ బ్రకటించు భాగ్యము నందితిని. ఆపద్యములు గూడ నిందు మొదటఁ జేర్పఁబడి యథాస్థానమున శోభిల్లుచున్నవి. ఇందుఁ గొన్ని వ్రాఁతతప్పులును, లుప్తభాగములును గలవు. ఈపద్యములు లభించువఱకు గద్యములోని-

"శ్రీమత్ఖాదిరీనృసింహళరుణాకటాక్షవీక్షణసమాగత కవితాధార పాలవేకరికులకలశాంభోనిధిసుధాకర తాడిగోళ్లకరియమాణిక్యనృపహర్యక్షపౌత్ర... కదురధరామండలాఖండలపుత్ర ...కదిరీపతినాయకప్రణీతంబు ... అనుమాటలంబట్టి విశేషములం దెలిసికొన ననువుపడలేదు. ఆపొడిమాటలకు