పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

240 శుకసప్తతి

సీ. మేర లెంచక సూరివారిండ్ల కేగి పా
ల్పెరుఁగు వెన్నలు మ్రుచ్చిలించె ననుచు
నీరాడుతఱి నాఁడువారుకట్టినపాఁత
లెత్తుకపోయి చెట్టెక్కె ననుచుఁ
బ్రతుకుభాగ్యము క్రిందఁబడఁగ బాఁపనయిండ్ల
కరిగి యాఁకటికిఁ గూ డడిగె ననుచుఁ
గడపటఁ జుట్టాల గరితలపైఁటలోఁ
జెయి వేసి యేమేమొ చేసె ననుచు
తే. వ్రాసికొన్నారు బాపనబైసిగాండ్రు
కొలముస్వామి విచారించుకోక యిట్లు
చేయునే యంచుఁ పెద్దలచేత వినెడు
కృష్ణకథలందు నిటువంటి వెల్ల వినఁడు. 549

సీ. తులసిపూసలు బోడితలయు నడ్డాదిడ్డి
పట్టెనామములు సంభ్రమము నొప్పఁ
బరువు లెత్తిన యెద్దుపై నొంటి తముకురా
నములును వేణునాదములు పొసఁగ
రచియించు తపముద్రలును బైఁపైఁబల్కు
గోవిందలును హాస్య మావహింప
నతిరసంబులఁబుట్టి యవనతులైన వా
రలకొసంగెడు దీవనలు సెలంగఁ
తే. గొలమువా రెంచఁగల గొల్లకొడుకుఁ గనఁగ
బంటులునువోలెఁ జుట్టము ల్వెంటనంటఁ
గోరి మ్రొక్కులు చెల్లించుకొఱకుఁగాఁగ
నాతఁ డేటేఁటఁ దిరుపతి కరిగివచ్చు. 549