పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

233 శుకసప్తతి

యన్ననుఁ గనుఁగొన రావే
ని న్నని వచ్చుట నుపేక్ష నించుట తగునే. 539

క. అన విని వదరకువే యా
తని కేమియు లే దటంచు దాని పిఱుందం
జని వీరుఁ డతని యాకృత
గని త్రోవం గాలి సోఁకె గావలె ననుచున్. 540

తే. వెన్ను చఱచి ధవళ వెఱవకురా యంచుఁ
బలుక నంత నతఁడు తెలివి నొంది
వారిఁ జూచి లేచి మీ రేల వచ్చితి
రేమి యెఱుఁగనైతి నింతతడవు. 541

చ. అనవుఁడు నవ్వి వీరుఁడు నిజాంబుజలోచనఁ జేరఁబిల్చి మం
తనమున నీతఁ డొంటికి మనంబున భీతి వహించెనేమొ నీ
వినుఁ డుదయించుదాఁక వసియింపు సహాయముగాఁగ నంచుఁ బో
యిన నగి ధూర్తుతోడ రమియించె వధూమణి యాస దీఱఁగన్. 542

క. అంతటఁ దెలతెలవాఱెం
గాంతాయని పలుక వైశ్యకామిని యిచట
న్వింత గదె తెల్లవాఱె శ
కుంతల యని యంతిపురము గుట్టునఁ జేరెన్. 543

తే. చేరి రేయి మహీకాంతుచెంత కరుగు
దానితోఁ బూని తోయజోద్యన్మరంద
ధార లూరఁగఁ గీత మోతరుణి యొక్క
కథ విను మటంచు వెస నరికట్టి పలికె. 544