పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 173

చ. చెడుకల గాంచి దానిఁ జని చెప్పితిఁ బెద్దలతోడ వారల
య్యెడ ననుఁ జూచి నీదుహృదయేశుఁడు వచ్చె నటంచు విన్న నె
క్కుడు నెనరొందఁ గీలుజడఁ గోసి నివాళి యొనర్పు మప్పుడే
కడమయు లేదటంచనిరి కావున నిత్తఱి నట్ల చేసితిన్. 232

క. నెఱు లనఁగ నెంత ఱేపే
పురిగొని తెగబారెఁడేసి పొడమెడు మీరే
మురువుగ జడ యల్లెదరీ
కరణి న్మీ రరుగుదేరఁగాంచుట చాలున్. 233

చ. అన నతఁ డింతభక్తిగలయంగన యింట వసించి నాకు శో
భనములు గోరఁగాఁగద యపాయము చెందక క్షేమలాభము
ల్గని యిలు చేరుటంచును దలంచి వధూమణియుక్తుఁడై నికే
తనమున కేగె వింటివి గదా సుమతీస్ఫుటచాతురీస్థితుల్. 234

చ. అనవుడుఁ జిల్కఁజూచి వణిగగ్రణిరాణి సుపాణిముత్తెపు
న్మినుకులు రాల నవ్వి యొక నీరజలోచన యట్లొనర్చినన్
వనితల కెల్ల వచ్చు నపవాదశతం బని పల్కునంతలో
నినుఁ డుదయింపఁగాఁ బడుకయింటికి నేగె నసిద్ధయత్నయై. 235

ఉ. అంతఁ గ్రమంబున న్రవి నిజాంతరశౌరిని మామగారిగే
హాంతముఁ జేర్చుదారి నపరాంబుధిఁ గ్రుంక నవారితోత్సుక
స్వాంత ప్రభావతీవికచవారిజలోచన చేరి నిల్చినం
గంతుపఠాణియుం గతలకారితనంబున మీఱి యిట్లనున్. 236

క. చనియెద వక్కఱతో న
య్యినుప్రక్కకుఁ ద్రోవ నొక్క యిక్కట్టైనం
గని మొక్కవోక గ్రక్కున
జనుదేఱ నుపాయ మెఱుఁగఁజాలుదె బాలా. 237