పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

172 శుకసప్తతి

చ. అనినఁ బ్రభావతీరమణి యడ్డార యయ్యెడ బొంకు టెట్లు నే
కనినదిగాదు విన్నదియుఁగా దది తెల్పినఁ దెల్పు లేకయుం
డిన మఱియూరకుండెదవు నేనిటువంటి వెఱుంగఁజాలు చాల్
దినమును రాజుఁ జేరఁజనఁదీరక నీకథ వించునుందునే. 226

మ. అనినం గీరము కోపమేల వినవమ్మా కొమ్మ యమ్మాడ్కిఁదె
ల్పినబంటుంగని యూరుజాబ్జముఖి మే ల్వేయేండ్లు వర్ధిల్లు చ
క్కనినానాథుఁడు వచ్చెనంచు మునుగల్గన్వచ్చి యామేలువా
ర్తనిజంబొందఁగఁ దెల్పితంచు మది మేరల్మీఱుధైర్యంబునన్. 227

తే. కాకి కఱ్ఱనెఁ దోడనె గౌళి పలికెఁ
బొలిచె నట్టింటఁ గుమ్మరిపుర్వు మెలఁగి
యిన్నియును గల్ల గాకుండ నేగుదెంచె
హృదయనాయకుఁ డోయన్న యిదియె చాలు. 228

క. అని పతితో నేనటకుం
జనుదెంచినదాక మీరచటనే యుండం
బనిగలదనుమని పనిచినఁ
జనియె న్వాడంత నవ్విశాలేక్షణయున్. 229

క. ఇల్లలికి మ్రుగ్గువెట్టి మ
హోల్లాసము పల్లవింప నొక్కమెఱుగుం
బళ్లెమునఁ గోసివైచిన
యల్ల జటాఖండ మిడియు నలరులతోడన్. 230

ఉ. ఐదువరాండ్లతోఁగదలి యాత్మమనోవిభుఁ డాయఁబోయి య
ప్పైదలివేణితోఁ జెలఁగుపళ్లెర మారతిభంగిఁ ద్రిప్పి యా
మోదముఁజూపె నాతఁడది ముందఱఁ దెల్పుమటంచు వేఁడఁగా
నాదయితుం గనుంగొని దృగంచలమం దుదయించు సిగ్గునన్. 231