పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xiii

చింతాకుముడుగుతరి, బుడిబుడియేడ్పు, తక్కులుతక్కు, కనకననిప్పులు, నీదుశౌర్యముగూలన్, బలబలవచ్చు, పొరపొచ్చెము, గాజుగడపికట్లు, గ్రుక్కుమిక్కనక, మెరమెరలు, కుంటిసుంకరి బెదరింపు, ప్రేగులోపలితీట, దట్టిగట్టు, తలతలమని, పదింబదిగ, నీళ్లునమలిన, లేదుబంతి, తలవాకిటకాఁపురమయ్యె, జోకలరేకల, ఇల్లుపట్టకతిరిగెడు, నేలమాలెలుద్రవ్వు, లోనలొటారము, ఇట్టి వెన్నని చూపవలెను. ప్రతిఫుటలో నిట్టివి నిండియున్నవి.

ఇతనికవితలో సామెతలకుఁగూడ కొదువ లేదు. నక్క గన్నవాఁడెల్ల వేఁటకాణడు, విపదిధైర్య మథాభ్యుదయే క్షమా, కంచంబుచెంత పిల్లికరణి, చనుమనుచుఁ ద్రోయ విస్తరి చినిగెడు నన్నట్లు, తిరుకొళములోనఁ బడినకోఁతిచందమున, దడి గరవబోవువేపిచందమున, కుంభంబుమీఁది పొట్టేలుక్రియన్, స్వామిద్రోహ మిదంభారం, తెగువయే దేవేంద్రపదవి, మగడొల్లని యాసతిని మారి యొల్ల దనంగన్, అడుగు వాసినచో నక్కర వాయు, ఇట్టిసామెత లెన్నియో యీకవితయం దిమిడియున్నవి.

3. హాస్యరసము:—సంస్కృతాంధ్రసాహిత్యశాస్త్రములందు హాస్యరసమును గురించి నిర్వచించినారు. కాని రెంటను హాస్యరసమునకు తగినరచనలు కానరావు. తిండిపోతు విదూషకుని చచ్చుమాటలు హాస్యజనకములు కాకపోయెను. బూతుమాటలతో వర్ణనలతో భాణాదులందు, చాటువులందు, హాస్యము నుత్పత్తి చేయఁజూచిరి. అది జుగుప్సగా మారెను. మొత్తము తెనుఁగువాఙ్మయములో కదిరీపతివలె చక్కనిహాస్యమును పోషించినకవియింకొకఁడు కానరాఁడు.