పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xv

నుండి యూరోపుభాషలలోని కీకథ లనువదింపఁబడెను. ఒక యూరోపియన్ భాషలో నీకథలు (Tristan un Isolde) అను పేరుతో ననువదింపఁబడెనట! ఈ విషయమునుబట్టి క్రీ. శ. 1300 కు పూర్వమే మనదేశమందు సంస్కృతములో శుకసప్తతియుండెనని 'డెకామరన్' కథలకన్న ముందే మనకథలు వ్యాప్తిలో నుండెననియు, బహుశః సంస్కృతమూలమునుండియే కదిరీపతి కథావస్తువును మాత్రము గ్రహింపవలెననియుఁ జెప్పవచ్చును. కానీ కథలలోని పాత్రధారులందును తెనుఁగువారే. వారును కదిరీపతికాలమువారే! ఈవిధానమును కవి యవలంబించి మనకు మహోపకార మొనర్చినాఁడు. 'డెకామరన్' తర్వాత ఫ్రాన్సులో ‘హెప్టామరన్' అను శృంగారకథలు పుట్టెను. అవి కూడ యిట్టికథలే. ఆ ‘హెప్టామరన్'కుకూడ 'డెకామరన్'వలె అధికవ్యాప్తి కలిగెను. ఈవిధముగా పైకథలన్నియు శుకసప్తతికథల సబ్రహ్మచారులని యెఱుఁగవలెను.

శుకసప్తతిలోని విశిష్టతలు

1. శైలి:- శుకసప్తతిశైలి యందఱికిని యర్థమగునట్టిది. నిఘంట్వపేక్ష కలిగింపనట్టిది. అతిసరళము. అతిమధురము. కథ రమ్యముగా నడిపించుట కెట్టిభాష వాడవలెనో యట్టిదే వాడినాఁడు. మనము వచనములోసయిత మంతధారాళముగా వ్రాయజాలము. తెనుఁగులో ప్రబంధయుగమందు వ్రాసినకవితలన్నియు కఠినమగుశైలిలోను, ఉత్ప్రేక్షాతిశయోక్తులతోను, శబ్దాలంకారములతోను, ద్వ్యర్థులతోను, ఒకేవిధమగు నొకేసమయములతోను నిండినదై, ఆనందము నిచ్చుటకుమారుగాఁ గ్లేశము నిచ్చునట్టిదై యుండెను. ప్రబంధములకథలుకూడ కవి