పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


పొలఁతులకు నిద్దఱకుఁ గొంచుఁబోవఁ దలఁచి.

41


క.

కుడిచేత మాంసఖండము
[1]లెడకేలను మద్యరససహితమగు కంచుం
గుడుకయు ధరించి మదమున
వడవణఁకులు గొనుచు నతఁడు వచ్చెన్ గుడికిన్.

42


వ.

జన్మాంతరస్థుండు వోలె రూపాంతరగతుండు వోలె నావిష్టుండు వోలె భూతాధిష్ఠితుండు వోలె గ్రహగృహీతుండు వోలె [2]నున్మత్తుండునుం బోలె మదిరామదాతిరేకంబునఁ దన్నుఁ దా నెఱుంగక పరిసరలతాకంటకానుషజ్యమానాంశుకోత్తరీయుండును నజ్ఞాతసమవిషమమేదినీభాగ విన్యాసప్రస్ఖలిత పాదద్వయుండునునై పలితపాండురంబులగు శిరోరుహంబులు విరిసి వీఁపునం బడ నొయ్యనొయ్యన నేతెంచి నిర్లజ్జుండును నిస్నేహుండును నృశంసుండును నగు నక్కర్మచండాలుండు గర్భగేహంబునకుఁ జక్కం గట్టెదుఱ నిలిచి రక్తకమలదళచ్ఛాయంబులగు కన్నులు దెఱచి విఘూర్ణమానతారకంబైన [3]వికారాలోకనంబున నలవోకయుం బోలె నిర్మలస్ఫటికమండపాధ్యాసీనుండును నమృతమయ జ్యోతిర్లింగమూర్తియు ముక్తాఫలధవళకాంతియుఁ ద్రిభువనవందితచరణుండును జరాచరగురుండును నగు నాగేశ్వరుని దర్శించి యమ్మహాదేవు [4]మౌళికపాలమాలికామండన ఖండేందు[5]శకలంబులకు గగనగంగాప్రవాహడిండీరఖండంబులకు నుష్ణీషఫణిఫణాఫలకంబులకుఁ జెలికారంబు సేయం జాలి పాంచజన్యసహోదరంబులన దుగ్ధాంబురాశిహృదయంబులనఁ జంద్రికా[6]శరణంబులన [7]నంగజాట్టహాసచ్ఛేదంబులన మెండుకొనియున్న పుండరీకంబుల పూజ గనుంగొని వెండియు.

43


ఉ.

చాయన భోగిరాట్కటకసన్నిధిదీపిత దీపమాలికా-
చ్ఛాయఁ బురఃప్రదేశమునఁ జాఁగిన నిర్జరవాహినీమహా-
తోయము సావి చీర యెగఁద్రోచి చొరంగఁ దలంచె నెంత లోఁ-
తో యని కొంకికొంకి పతితుం డతఁ డాసవపానవిక్రియన్.

44


గీ.

పవనవశమునఁ గేతకీప్రసవధూళి
యంగమున హత్తియుండంగ నాతఁ డపుడు
విమలభస్మసముద్ధూళన మొనరించి
పాశుపతదీక్షఁ గైకొన్న భంగి నుండె.

45


చ.

కలఁగఁగఁ బాఱె నాతని యఘంబులు పంచహృషీకసంభవం-
బులు బహుకాలసంకలితముల్ దవవహ్నిచిటచ్ఛిటధ్వనిం
గలఁగఁగఁ బాఱు పక్షుల ప్రకారమునం దొలుజాముపూజకై
బలుపటహమ్ము ఠమ్మనుచు భర్గుని గేహమునందు మ్రోసినన్.

46


వ.

ఆ శివరాత్రి పుణ్యకాలంబునఁ బురాణంబులు వినిపించువారును నితిహాసంబులు చదువువారును బంచాక్షరీ పంచబ్రహ్మాది మంత్రంబులు జపించువారును నీలకంఠస్తోత్రంబులు పఠించువారును బ్రాణాయామంబు లనుసంధించువారును బ్రత్యాహారంబులు నడుపువారును [8]బ్రదక్షిణంబులు సేయువారును భస్మోద్ధూళనంబు లొనర్చువారును దురోదరంబుల వినోదించువారును నష్టావధానంబులఁ గ్రీడించువారును వీణ లాస్ఫాలించువారును గావ్యగోష్ఠి సలుపువారును బరిహాసం బాదరించువారును బిందుమతి యభ్యసించువారును బ్రహేళికలు భావించువారును నాడువారునుం బాడువారును మేషకుక్కుట [9]కరేటు లావుక కపింజల యుద్ధంబులు వీక్షించువారును గుబ్జవామన కిరాతబర్బర జరఠమూక జనవికారంబు లవలోకించువారునై జాగరంబులు సలుపుచునుండిరి. సుకుమారుండును నొక్కించుక యన్నుం [10]దేఱికొని వారిం జూచుచుండె. నప్పుడు శివగంగానిర్ఝరజలతరంగశీకరజాలజనితజడిమంబులు నందిరోమంధఫేనబిందువాహులుం

  1. తా. పెడ
  2. ఉన్మత్తుండ పోలె
  3. తా. కేకరాలోకంబున
  4. తా. మౌళిం గపాల
  5. తా. శకలంబునకు
  6. తా. ధవళంబులన
  7. ము. నంగజాట్టహాసంబు
  8. తా. అంగప్రదక్షిణంబులు
  9. తా. నక్రకరలావుక
  10. తా. తేఱికొన