పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


శా.

ఏమాసించినఁ బ్రాణరక్షకయి యేమేఁ బాపముల్ సేసినన్
భామా చెల్లుఁ బురాణసంహితలఁ జెప్పన్ విందుమే కాదె వి-
శ్వామిత్రుం [1]డెడరైనచో శునకమాంసంబున్ భుజింపండె నీ
వ్యామగ్రాహ్యకుచంబు లంటి యిదె [2]నా ప్రాణంబు రక్షించెదన్.

89


వ.

ఇదె యెదుర (ససంభ్రమభ్రమద్భ్ర)మరకుల చరణనఖశిఖాశిఖరవిశీర్యమాణ కుసుమకేసరరేణు త్రసరేణువిసరపిశంగితోపకంఠంబు లతామండపం బిదె వెనుకఁ గుటిలశుకత్రోటికోటివిపాటిత మధురఫలరసధారాసార దుర్దినాయమానాభ్యంతరప్రదేశంబు చూతతరువాటికాభ్యాశంబిదె కెలన మదకలమల్లికాక్షపక్ష[3]పాళీనవపవనసంపాతకంపమాన కమలకేసరపరాగధూళీవిరచితాళీక సంధ్యానుబంధచకిత చక్రవాకనీడోద్భవక్రీడానీడంబులు, సరససైకతవేతసీనికుంజక్రోడంబు లిందు నీకు నింపు వుట్టినట్టియెడ నన్ను మన్నింపు మంటకున్నదాననని భయంబందకు కుసుమసమయంబు గదా ఫలావాప్తికి మూలంబింకఁ గాలక్షేపంబు చేసితేని కందర్పుండు దర్పాతిరేకంబున భవద్భ్రూవల్లీమతల్లికిం దల్లియగు [4]నించువింటిం బద్ద దిగిచి కొదమ తుమ్మెదఱెక్కగఱిగట్టిన పూమిట్టకోలల హృదయం బుద్ఘాటించి చంపుఁ జంపకకుసుమగంధీ ప్రాణంబు రక్షింపుమిదె నీకు సేవాంజలి యని కంకణఝణఝణత్కారంబు తోరంబుగా సుకుమారుండు నఖకిరణపరంపరాకుసుమ కుట్మలాభిరామంబులగు కరకిసలయంబులు మోడ్చి ఫాలభాగంబునం గీలించిన.

90


శా.

వాలాయంబుగ నద్ధరాసురుఁడు దన్ వాంఛించినన్ మందహా-
సాలంకారమనోజ్ఞమైన ముఖ మొయ్యన్వాం[5]చి చండాలి యా
లీలా[6]భావము కీలెఱింగి నవమల్లీకుంజమధ్యంబునం
గేలీతల్పముఁ దీర్చెఁ[7]బో మృదులకంకేలీప్రవాలంబులన్.

91


వ.

అనంతరం [8]బధరీకృతకుసుమాయుధరూపసంపన్నుఁడగు నవ్వసుధానిలింపుం డపహసితసురసిద్ధగంధర్వవిద్యాధర లీలావిలాసినీవిలాసవతి యగు నవ్వెలివాడచేడియం గూడి సురతసౌఖ్యం [9]బనుభవించె నంత.

92


ఉ.

కాయజవిక్రియం [10]బడఁగఁ గానికులంబున సంభవించి య-
న్యాయము సేయునే యిటు దురాత్ముఁడు వీఁడు [11]త్రపాభిమానముల్
మాయఁగఁదట్టి యంచు నతిమాత్రము లజ్జితుఁడైన కైవడిం
దోయజషండబాంధవుఁ డధోముఖుఁడయ్యె నభోఽంగణమ్మునన్.

93


గీ.

గగనయానవేగంబున గలమరించి
కడుపునిండంగఁ గ్రోలిన కమలమధువుఁ
గ్రక్కెనో నాఁగ గగనమార్గంబునందు
భానుబింబంబు రక్తాతపంబుఁ గాసె.

94


శా.

వ్రాలెం బశ్చిమశైలశృంగముపయిం బ్రత్యగ్ర[12]మధ్వాగమో-
న్మీలత్కింశుకకోరకస్తబకకాంతిన్ భానుమన్మండలం-
బాలంబించె మరుండు హస్తమున దాక్షారామలీలావతీ-
భ్రూలేఖానిభవిభ్రమాభ్యుదయముం బుండ్రేక్షుకోదండమున్.

95


క.

క్రుంకె విభాకరంబము
పంకజషండములు మొగిడెఁ బ్రత్యగ్వీథిం
గంకేలీతరుపల్లవ-
సంకాశచ్ఛాయఁ గొమరుసంజ జనించెన్.

96
  1. తా. డెడలైనచో
  2. తా. నేఁ బ్రాణంబు
  3. తా. పాధివిక్షేప ప్రభవసంపాత
  4. తా. నించువిల్లు దెగనిడం దిగిచి
  5. తా. చె
  6. ము. భావ మెఱింగి యేగి నతవల్లీ
  7. తా. బోఁటి మృదుకంకేళి
  8. తా. బధఃకృత
  9. తా. బు లనుభవించె నంత
  10. ము. బడయఁ
  11. తా. వ్రతాభిమానముల్
  12. తా. మృద్భాగ