పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

క..

శ్రీదోరంతర[1]దేవ
ప్రాదితభాషావిశేషభాసురకీర్తి-
శ్రీదార్ఢ్య వివిధపూజా
మోదితగిరిదుహితృకాంత ముమ్మయశాంతా.

1


వ.

అక్కథకుండు శౌనకాది మహామునుల కిట్లనియె. నట్లు తల్లిదండ్రుల నూరార్చి వెడలి సుకుమారుండు నిజాంతర్గతంబున.

2


గీ.

పోయె నుపదేశకాలంబు పూర్వముననె
కడచె ధైర్యంబు [2]జఠరవిక్రాంతమయ్యె
శీలసంపత్తి యిఁక నేమిసేయువాఁడ
భామినీ[3]సక్తి మన్మథుబారిఁ బడితి.

3


శా.

[4]పంతంబోడదు ధర్మముం దగవునుం బాడిం గులంబున్ విచా-
రింతున్ వేదపురాణశాస్త్రమతపారీణుండఁ గా నెట్ల-
ల్పాంతద్వాదశభానుమత్కిరణదాహక్రూరకామవ్యథా-
సంతాపజ్వరవేదనాభరమునం జాకుంట [5]సిద్ధించినన్.

4


సీ.

చాండాలుతోఁ బుల్కశత్వంబు గైకొను
          బ్రహ్మహత్య యొనర్చి బ్రాహ్మణుండు
క్రిమియై పతంగమై కీటమై జన్మించు
          నాసవం బాని భూమీసురుండు
క్రవ్యాదసత్త్వసర్గమున నుద్భవమందు
          విప్రుఁ డాచార్యునివెలఁదిఁ గవిసి
శ్యామచారుండు పిశాచమౌ బాడబుం-
          డన్యుని విత్తంబు నపహరించి


గీ.

యయిన [6]నేమగు వీనిలో నన్నిటికిని
సుఖము దుఃఖంబుఁ జర్చించి చూచినప్పు-
డెల్లసంసారులకుఁ (బోలె) హెచ్చు(గుందు)
లేకయుండుట గందుమో లేదొ జగతి.

5


గీ.

వామదేవుండు శుకుఁడుఁ [7]గేవలము దక్క
ముక్తులెవ్వరు వింటిమే ముజ్జగమున
జంతువుల కెల్ల [8]సరియ సంసారయాత్ర
విధినిషేధంబులకుఁ జొప్పు వెదకనేల.

6


శా.

ఆతంకంబున కేమికారణము బ్రాహ్మ్యం [9]బింతయుం జూచి యే
తాతల్ గట్టిన చెర్వు లే శ్రుతులు [10]బోధప్రక్రియల్ స్వల్ప మే
చేతోజాతు నుపాశ్రయించె[11]దఁ బరస్త్రీలన్ వినోదించెదన్
మాతంగీపరమేశ్వరిం గొలిచెదన్ మద్యంబు సేవించెదన్.

7
  1. ము. వేదప్రోదిత
  2. తా. జడత
  3. తా. సఖి
  4. తా. పంతంబున్ దధుధర్మముం
  5. తా. సిద్ధించునే
  6. ము. నేమిగా
  7. తా. కేవలమతంక
  8. తా. సరియె
  9. తా. బంతయున్
  10. తా. బుద్ధప్రక్రియల్
  11. తా. దు చిరస్త్రీల