పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

అనినఁ దల్లిదండ్రులకుం బ్రణామంబు చేసి యింతనుండి మీ యాజ్ఞ [1]శిరంబున ధరియించి బుద్ధిమంతుండనై యుండెద మీరు [2]వగవకుండుండని పలికి సముచితప్రకారంబున వీడుకొనియె ననిన నటమీఁది వృత్తాంతం [3]బెట్టిదని యడిగిన.

113


మ.

వరశైవైకవిధాన[4]దానకథనవ్యాపారపారంగతా-
స్థిరలక్ష్మీనవశారదోదయ దయాధీనాయతాలోక లో-
కరమాపాదన పాదపద్మవినతక్ష్మాపాలసంశీల శీ-
లరతిప్రస్ఫుటశాంత శాంతనవకల్పద్వీర వీరాగ్రణీ.

114


క.

ధీమత్కవితావిస్తర-
ధామాయిత నిరుపమానదానాంబుద హృ-
ద్భీమ జయోత్కలసీమా-
రామామన్మథవిశేష రాజితమూర్తీ!

115


మందారదామ.

లింగార్చనా[5]రూఢలీలావిశాలా
గంగాంబు[6]సుస్వచ్ఛకావ్యైకజాలా
[*]సంగీతసాహిత్యసౌహిత్యలోలా
శృంగారసద్భక్తసేవాను[7]పాలా.

116


[*]తాళపత్రమున లేదు.

గద్యము
ఇది శ్రీమత్కమలనాభపౌత్ర మారయామాత్యపుత్ర సకలవిద్యా
సనాథ శ్రీనాథనామధేయ ప్రణీతంబయిన
శివరాత్రి మాహాత్మ్యంబునందు
ద్వితీయాశ్వాసము.

  1. ము. శిరసున
  2. తా. వగవకుండని
  3. తా. బెట్లని
  4. ము. పాత్ర కవితా
  5. ము. రూఢి లీలావతారా
  6. తా. మృత్‍స్వచ్ఛ
  7. ము. హేలా