పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఉ.

సంపద పేరి కట్టిఁడిపిశాచము సోఁకిన మానవుండు పూ-
జింపఁ డభీష్టదేవత భజింపఁడు సజ్జనులైనవారి మ-
న్నింపఁడు మిత్రబంధుల గణింపఁడు ధర్మరహస్యముల్ విచా-
రింపడు (నేమముం దగ భజిం)పఁ డహంకరణంబు పెంపునన్.

98


గీ.

ఉద్ధతుం [1]డయి సుకుమారుఁ డుండలేక
[2]వీటఁ జక్కని జవరాలి వెదకివెదకి
వలపు పుట్టించి సంకేతములకుఁ దార్చి
[3]చలుపు రతికేలి బహుళపక్షంబు రేలు.

99


గీ.

పద్మనాభుండు మదనగోపాలమూర్తి
ఘోషమున [4]నెట్లు వలపించె గొల్లసతుల
నెట్టుకొని [5]యట్లు వింధ్యాద్రిపట్టణమునఁ
బరపురంధ్రుల [6]వలపించె బ్రాహ్మణుండు.

100


సీ.

యమునానదీసైకతమున జాలరికన్య
          చనుదోయి నంటఁ డే శక్తిసుతుఁడు
నందవ్రజంబులో నలిననాభుం డెట్లు
          విహరించెఁ బదియాఱువేలసతుల
దేవదారువనంబులో విరూపాక్షుండు
          మునిభామినుల నెట్లు మోసపుచ్చెఁ
గొక్కొరొకోయని కోడియై యెలుఁగించి
          యమరనాయకుఁ డె ట్లహల్యఁ గలసె


గీ.

మొలకచన్నులపాయంపు ముద్దుఁగూఁతుఁ
బట్టుకొనె నెట్లు పైకొని పద్మభవుఁడు
చందురుం డెట్లు వొందె నాచార్యులేమ
ననుచు విప్రుండు [7]రమియించె నన్యసతుల.

101


సీ.

[8]సంధ్యాభివందనశ్రద్ధ యుద్వాసించె
          గాయత్రి దవ్వులఁ గట్టిపెట్టె
నగ్నిహోత్రముమీఁది యాస నుత్పాటించె
          నఘమర్షణస్నాన మరసి [9]మానె
[10]నిహపరసామగ్రి నీయఁజాలెడునట్టి
          విధిదేవతార్చన వీటిఁబుచ్చె
[11]వేదపాఠము మానె వివిధసత్కర్మాది

  1. తా. డైన
  2. తా. వింట జిక్కని జవరాలి
  3. తా. సలుపు
  4. తా. నెట్టు
  5. తా. యట్ల
  6. ము. వలపించు
  7. ము. రమియించు
  8. తా. సంధ్యాదివందన
  9. ము. మాపె
  10. తా. వైశ్వదేవముమీఁది విశ్వాసము త్యజించె హంతకారము బుద్ధి నపనయించె
  11. ?. దేవతార్చనము మీఁది ప్రయత్నమును మానె చదువు శాస్త్రము నౌరుసౌరు పరచె