పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


గీ.

భద్రజాతి యేనుంగు లప్పట్టణమునఁ
బ్రకటితస్ఫూర్తి నొప్పు సిబ్బములతోడ
విమలవారాశిఫేనఖండములతోడి
కవ్వపుంగొండబందులో కాక యనఁగ.

10


ఉ.

లక్షలసంఖ్య లప్పురి కెలంకులయందుఁ గొలంకు లొప్పు వాః-
పక్షిగరుచ్ఛటాపవనపాతవికంపితపంకజంబులై
[1]వీక్షణకౌతుకంబు ప్రభవింపుచునుండును లీలమై సహ-
స్రాక్షుఁడు విశ్వరూపమహిమాద్భుతముం బ్రకటించెనో యనన్.

11


శా.

ఆ వింధ్యాచలదుర్గ [2]మేలు శబరాధ్యక్షుండు హేమాంగదుం
డా వార్ధిద్వితయద్వయావధిగఁ జక్రాధీశ్వరుల్ గొల్వ నా-
శావేదండఘటాకపోలతలమూర్ఛద్దానధారాజల-
ప్లావప్రక్రమసంవిశుద్ధబహులప్రస్ఫూర్తిమత్కీర్తియై.

12


సీ.

శివుని కైవడి [3]మహాసేనానుయాతుండు
          బలభేది పగిది [4]నపవ్యపాయుఁ
డరవిందహితు లీల [5]నధిగతాభ్యుదయుండు
          [6]బుధుని క్రియ నజహత్పుష్కరుండు
గంగాప్రవాహంబు కరణిఁ బావనమూర్తి
          భుజగాధిపుని భంగి భోగశాలి
యేనుంగు చందాన దానధారాశోభి
          శౌరి లాగున శంఖచక్రపాణి


గీ.

కర్త యాశ్చర్యములకు నాకరము నీతి-
కఖిలవిద్యాగమములకు నాస్పదంబు
పగఱ కుత్పాతకేతువు బంధుకోటి-
కమరలోకద్రుమంబు హేమాంగదుండు.

13


గీ.

ఆ నృపాలుండు నీతివిద్యానిరూఢిఁ
జారదృష్టియౌఁ గాని విచారదృష్టి
సమధికైశ్వర్యవైభవోజ్జ్వలత నాతఁ
డష్టమూర్తియౌఁ గాని యనష్టమూర్తి.

14
  1. తా. వీక్షకు గౌతుకంబు
  2. తా. మేలె
  3. ము. మహాసేనాని యాత్ముండు. తా. మహాసేనాని యాతండు
  4. తా. నపవ్యసాయు
  5. తా. నధికరాభ్యుదయుండు
  6. ?. బుద్ధుని క్రియ జయత్పుష్పశరుఁడు