పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

సర్వజ్ఞ [1]సకలసృష్టిస్థిత్యంతకారణవరేణ్య భక్తిగమ్య సకలకల్మషాపహ శ్రీపాదపద్మ వేదాగమపురాణేతిహాససంహితామహాఫలభూత సర్వభూతహృదయస్థిత అఖిలదేవమయ మహాదేవ నీకు నమస్కరింతు.

23


సీ.

ఎవ్వానియందుండు నెల్లభూతంబులు
          సింధువునందు వీచికలు వోలె
నెవ్వాఁడు వసియించు నెల్లభూతములందు
          నంబువుల్లోలంబునందు వోలె
నెల్లభూతంబుల హృదయంబులందును
          వసియించు నెవ్వఁ డాకసము వోలె
నొకఁడు పెక్కై తోచు నుదధిఁ జంద్రుఁడు వోలె
          నెవ్వఁ డజ్ఞానమూఢేంద్రియులకు


గీ.

పురు(షుఁ)డని బ్రహ్మమని యజ్ఞపురుషుఁడనియు
నర్కుఁడని వాయువని శక్రుఁడని హరియని
చంద్రుఁడని కొల్తు రాయాయి సరణివారు
భక్తి నెవ్వాని నట్టి నీ బంట నభవ.

24


వ.

ఒక విన్నపం బవధరింపుమా.

25


సీ.

ధర్మాసనమున [2]కాఢ్యతఁ గృప చేసితి
          [3]దక్షిణాశాధిపత్యంబు నొసఁగి
పాపులం బా(పా)నురూపదండంబుల
          దమియించుటకు నియోగము ఘటించి
చనవరిఁ జేసి [4]పంచిననాటినుండియు
          నేర్చిన చందాన నియమపరత
దేవరయాజ్ఞ యేదియు వెలిగాకుండ
          వర్తిల్లుదును సమవర్తి నగుచు


గీ.

నభవ యెన్నండు నా దూత [5]లాటువడరు
భర్గ యెన్నండు నా యాజ్ఞ పలుచఁగాదు
శర్వ సుకుమారుఁ[6]డనెడు దుర్జాతి పుట్టి
చావఁబట్టి యే నష్టకష్టములఁ బడితి.

26


గీ.

అభవ నీ కింకరుండు ఖట్వాంగహేతి
కాలమృత్యువు [7]మునిపండ్లు రాల మొత్త
మూలఁబడియున్నయది ముండమోపి వోలె
నిల్లు వెడలక యది మహాహ్రీభరమున.

27


హరిగతి రగడ.

[8]అయయో మొఱ్ఱో యబ్రహ్మ(ణ్య)ం [9]బనుచును నాక్రోశించుచు(ను మహా)-
భయవిహ్వలులై యేతెంచిరి మత్పార్శ్వమ్ములకు మదీయకింకరులు
[10]జయనాద హలా సమధికలీలాసంరంభంబున దేవర ప్రమథులు
పయికొని వచ్చిరి పులికళవసముల [11]ప్రహరించుచు వీఁపుల వెంటాడగ.

  1. తా. సకలస్థిత్యకారణవరేణ్య
  2. తా. కాద్యత
  3. తా. దక్షిణేశాధిపత్యంబు
  4. తా. పంపితి
  5. తా. లోటు
  6. తా. డనియెడి
  7. తా. ముకుబండ్లు
  8. తా. అయిదొ మొరయో
  9. తా. బని యాక్రోశించుచు
  10. తా. జయవాది
  11. తా. వీఁపులు ప్రహరించుచు వెంటాడించంగను