పుట:శివతత్వసారము.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

శివతత్త్వసారము ప్రాచీనాంధ్రవాఙ్మయమునకు సంబంధించిన కృతి. ఈ నా డాంధ్రవాఙ్మయచరిత్రకారులు ప్రాచీన కాలమును క్రిందియుగములుగా విభాగించిరి.

1. ప్రాఙ్నన్నయ యుగము౼I క్రీ.శ. 1 వ శతాబ్దినుండి-850 (వచనము)
                                  II క్రీ.శ. 850-1000 (పద్యము)
2. నన్నయ యుగము౼ క్రీ.శ. 1000-1100
3. శివకవి యుగము౼ క్రీ.శ. 1100-1250
4. తిక్కన యుగము౼ క్రీ.శ. 1250-1350

పై యుగములలో శివకవి యుగమునకు చెందినది శివతత్త్వసారము. ఆ యుగమునందలి కవులు ముగ్గురు[1]. మల్లికార్జున పండితుడు, నన్నిచోడుడు, పాల్కురికి సోమనాథుడు - ఈ మువ్వురలో మొదటివాడైన మల్లికార్జునపండితుడే ఈ శివతత్త్వసారమును ధరించిన మహాకవి. ఆంధ్రవాఙ్మయమున శైవసాహిత్యము మల్లికార్జున పండితునితో ప్రారంభము. ఆశైవవాఙ్మయమునకు శ్రీకారము చుట్టనది శివతత్త్వసారము.

తాళపత్ర ప్రతి

ఈ గ్రంథమున కొక్కటే తాళపత్ర ప్రతి లభించినది. అది చదువుల రామలింగయ్యగారను జంగమదేవర సంగ్రహములోనిది. ఆ తాళపత్ర ప్రతిలో నాలుగు గ్రంథములున్నవి. నూటడెబ్బదినాలుగు కమ్మలున్న యాప్రతిలో 20వ తాటాకు మొదలు 67 వఱకు నీ శివతత్త్వసార మున్నది. 67 వ తాటాకుచివర వ్రాయసకాని పేరును, వ్రాసిన కాలమును నిట్లు చెప్పబడినవి.

"స్వస్తిశ్రీ జయాభ్యుదయ శాలివాహన శకవరుషంబులు........................

  1. వీరి మువ్వురితో బాటు సర్వేశ్వరశతకకర్తయైన యథావాక్కుల అన్నమయ్యకూడ శివకవి యుగములో క్రీ.శ. 1242 లో నున్నాడు. (చూడుడు. తెలుగు కవుల చరిత్ర - శివకవి యుగము యథావాక్కుల అన్నమయ్య- పుటలు -350-379)