పుట:శివతత్వసారము.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పద్య వివరణ

శివతత్త్వసార మాంధ్రశైవవాఙ్మయమున ప్రథమగ్రంథ మగుటయే కాక తెలుఁగున వీరమాహేశ్వరాచారమను ఆరాధ్యసాంప్రదాయమును వివరించు గ్రంథములలో ప్రధానమైయున్నది. ఇందు శైవమతమునకు సంబంధించి శ్రుతిస్మృతిపురాణాగమేతిహాసములనుండి విషయములు సంగ్రహింపబడి ఆ యర్ధము తెలుగుభాషలో తెలుపబడియున్నది. ఇందలిపద్యము లన్నియు కందములే యైనను, అవి సులభశైలిచే రచింపబడియున్నను, విషయ మతిగంభీర మగుటచే పాఠకులకు నీ గ్రంథము సంపూర్ణముగా నవగాహన చేసికొనుటకు వీలుకాక యున్నది. కేవలము సాహిత్యజిజ్ఞాస గల పాఠకులకే కాక శైవులకు నిత్యజీవితముతో సంబంధించిన మతగ్రంథ మగుటచే ప్రతిపద్యార్ధవివరము అత్యావశ్యకమై యున్నది. అంతేకాక కొన్నిపట్టుల మతసాంకేతికపదనిర్వచన మవసరమై యున్నది.

ఈ యుద్దేశ్యముతోడనే మూలమున 115 వ పద్యమువఱకును పద్యార్థవిశేషములు యడుగున నీయబడినవి. తక్కిన పద్యముల విశేషము లీక్రింద చూపుతున్నాను.

121. శివభక్తులను చూచి వా రేజాతివా రని విచారించకూడదు. శైవమతమున జాతిభేదములు లేవు.

ఈవిషయమై పాల్కురికి సోమనాథు డిట్లు చెప్పియున్నాడు.

క.

భువిలో శివదీక్షితులగు
శివభక్తుల పూర్వజాతిఁ జింతించుట రౌ
రవనరకభాజనం బా
శివుఁ బాషాణంబు గాగఁ జింతించుక్రియన్.

అనుభవసారము 183 ప.