Jump to content

పుట:శివతత్వసారము.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

మాలలఁ గులజులఁ జేయును
బోలఁగ శివభక్తులైన భువి నెఱుఁగరె! మా
నీలగ్రీవుఁడు గులజుల
మాలలఁగాఁ జేయు భక్తి మది లేకున్నన్.

471


క.

చెన్నయ మాలఁడు కాఁడే!
మున్ను మహాదేవుఁ గొలిచి ముక్తుండయ్యెన్
జన్నముక శివుని దక్షుఁడు
మన్నింపమిఁ జేసి సచ్చి మాలం డయ్యెన్.

472


క.

వేయేమి! దొల్లి ముక్తికి
బోయిరె! విద్యలును వంశములు గలవారల్
బోయము సాలీఁడును మా
కాయజహరుఁ గొలిచి ముక్తి గాంచిరె గాదే!

473


క.

వారనియమనియమములకు
ఘోరవ్రతములకు శివుఁడు గూర్పఁడు శివనిం
దారతి విని తను విడిచిన
గౌరీసతి భక్తి యుక్తిఁ గని కూర్చు క్రియన్.

474


క.

జపములకుం దపములకును
నుపవాసంబులకుఁ గూర్పఁ డుగ్రుఁడు నిందా
కుపితమతిఁ దన్ను విడిచిన
యుపమన్యుని భక్తియుక్తి కొడఁబడు పగిదిన్.

475


క.

కన్ను వడిఁ బుచ్చి పూన్చిన
వెన్నునిభక్తికి వరంబు వెదచల్లు క్రియన్
గన్నులు దెఱవక ముందర
మిన్నక కూర్చున్న శివుఁడు మెచ్చునె వారిన్.

476