పుట:శివతత్వసారము.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

తన గుఱ్ఱము సతులును బరి
జనులునుఁ దనతోడ రాఁగ శాశ్వతభక్తిన్
జనియె భవత్పురమునకును
గొనకొనఁగఁ గుమారసాల ఘూర్జరుఁడు శివా!

437


క.

గుడి వడుగు దాఁచి కుంచియ
పొడ సూపక తలుపు వెట్టి పోయిన నీ వ
ప్పుడె తలుపు దెఱచి భక్తికిఁ
బొడసూపవె! కిన్నెరునకుఁ బురసంహారా!

438


క.

చోడని యేనుఁగు జంపుచుఁ
జోడని శివభక్తి మహిమ చొప్పడ నీచే
రూడిగఁ గ్రమ్మఱఁ బడయఁడె!
యోడక యిఱుదత్తుఁ డనఁగ నొకభక్తుఁ డజా!

439


క.

కడుఁగడు రౌద్రంబున జత
పడు మదగరిఁ జంపి యపుడ పడయడె భువి ను
క్కడఁగియు బిజ్జలుఁ డడుగుడు
మడివలు మాచయ్య భక్తి మహిలోఁ గలదే!

440


క.

రావీది యేచి యెక్కిన
మావంతునిఁ జంపి వచ్చు మదకరి దనపై
రా వెఱచి మగుడఁ బాఱదె!
బావురి బ్రహ్మయకు నీప్రభావమున శివా!

441


క.

భూతలమున నిది యంతయు
నూతనమని పొగడ నేడు నూఱేండ్లు మనం
డే! తనకు భక్తిఁ ద్రిపురా
రాతీ! సకలేశు మాది రాజయ్య శివా!

442