పుట:శివతత్వసారము.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

తనుఁ గని మ్రొక్కిన "దీర్ఘా'
యని పలికినఁ బిదపఁ జచ్చె నాఁటది తగునే
యనఁ బ్రాణము వడసెను వా
రని దయతో ముసిఁడి చౌండరాయఁడు రుద్రా!

414


క.

తన లంజయునుం జిల్కయుఁ
దన లంజియ బంధుజనులు దానును జనఁడే!
జనులెల్లఁ జూడ మలహణు
నిను సంస్తుతి చేసి దేవ! నీ పురమునకున్.

415


క.

వెలయఁగ నాఁబోతులుఁ దప
సులు మృతులై యెదురురాఁగఁ జూచుచుఁ బ్రాణం
బులు వడయఁడె! నీదయ వా
రల కప్పుడె ముసిఁడి చౌండరాయఁడు రుద్రా!

416


క.

పెనిమిటి శివభక్తుడు గా
డని యొల్లక రోసి నిన్ను నడిగిన రాత్రిన్
బనఁబడసె గాదె! శంకర!
గొనకొనఁ బుంస్త్వమ్ము నాఁడు గూఁతురు నీచేన్.

417


క.

కెంబాగి బోగిదేవని
వెంబడిఁ జని వచ్చి వీడుపీఠంబుల లిం
గంబులు వడి విప్రులు లీ
లం బొగడఁగ నిట్టి వత్సలత్వము గలదే!

418


క.

విన్నపము సలిది యంబలి
మున్నని నివేద్యంబు సూపి మ్రొక్కుచు నీకున్
సన్నుతభక్తిని మాదర
చెన్నయ నీ కరుణ ముక్తి చేకొనఁడె శివా!

419