పుట:శివతత్వసారము.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

భక్తుల దవ్వులఁ గని శివ
భక్తులు వచ్చిరని పొంగి బ్రతికితినని పో
భక్తుల కెదురేగి యథా
శక్తిస్థితిఁ జేయవలయు సత్క్రియలు శివా!

140


క.

భక్తుఁడు లోకహితార్ధుఁడు
భక్తిహితార్థుండు శివుఁడు భావింపఁగ నీ
యుక్తి యథార్థమ్మని నీ
భక్తులఁ బూజించవలయు భక్తులకు శివా!

141


క.

లోకానుసారికిని శివ
లోకము దొరకొనదుగాన లోకము నెమ్మిం
చేకొనక విడిచి శివ! నీ
లోకము గావలయు భక్తిలోలుఁడు రుద్రా!

142


క.

లోకము విడువనివానిని
లోకము విడువదని విశ్వలోకేశ్వర! నీ
లోకముఁ గోరెడు మనుజుఁడు
లోకము వోవిడుచు నీవ లోకముగ శివా!

143


క.

గురుఁ డాది దనకు గఱపిన
వెరవునఁ జని మీఁద భక్తి వేదించిన న
గ్గురువుతము గడచి చేసిన
పరవశుఁడై మఱవవలయు భక్తుం దన్నున్.

144


క.

హర! నీ భక్తి నిషేధక
చరితలు వోవిడిచి నిన్నె చనఁ గొలిచి నిరం
తరభక్తుఁడై శివైక్యుఁడు
నిరాణ(ళ) యగు పసిఁడివోలె నిలువఁగ వలయున్.

145