పుట:శివతత్వసారము.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

నిత్యమహాజనదూష్యము
ప్రత్యక్షాదిప్రమాణబాధాబాహ్యం
బత్యనుచిత మద్యైతము
కృత్యాకృత్యాదిశూన్యకీటకము శివా!

52


క.

అద్వైతమ్ము పురాతన
విద్వన్మునివరుల కెల్ల విద్విష్టము సా
క్షాద్వేదోక్తము గామిని
సద్విద్వద్ద్వైతులకు నసహ్యంబు శివా!

53


క.

ప్రాజ్ఞులు వేదజ్ఞులు లో
కజ్ఞులు చేకొండ్రె [1]గతశిఖాగాయత్రీ
యజ్ఞోపవీతనాస్తికు
లజ్ఞులు చేకొండ్రుగాక యద్వైత మజా!

54


క.

స్వేచ్ఛాచారులు మిథ్యా
విచ్ఛేదనవేదశాస్త్రవిప్లవవాదుల్
ప్రచ్ఛన్నదోషు లజ్ఞా
నాచ్ఛాదితదుష్టచిత్తు లద్వైతు లజా!

55


క.

కమలాక్ష కమలగర్భ
ప్రముఖాఖిల సురలు మునులుఁ బాశుపతులు భ
స్మమయాంగజటారుద్రా
క్షమాలికాధరులు కాని కా రద్వైతుల్.

56
  1. గతశిఖాగాయత్రీయజ్ఞోపవీతనాస్తికులు - జుట్టును గాయత్రీమంత్రమును, జంరెమును వదలి నాస్తికులైనవారు - లింగధారులలో సన్యాసులు లేరు - ఇం దద్వైతసన్యాసులు నిరసించబడిరి.