పుట:శివతత్వసారము.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీశివ

శివతత్త్వసారము

(కంద పద్యములు)

క.

శ్రీపతి వాక్పతి ముఖ్య మ
హాపురుషులు [1]నెరఁగనోప - రతి వాఙ్మనస
వ్యాపారమైన నీ నిజ
రూపము నే నిట్టిదని నిరూపింతు శివా![2]

1


క.

ఒందంగ శివుని తత్త్వం
బందఁగ విజ్ఞానమే క-మజమణు చరమా
నందం బనియెడుఁగాని య
నిందితముగ నిట్టిదనఁగ - నేరవు శ్రుతులున్.[3]

2


క.

ఇది గా దది గా దనియెడి
మొదలఁ బృథివ్యాదులైన - మూర్తుల నెల్లం
జదువుచు శివు నిన్నెఱుఁగక
వెదకుచు నున్నవి సమస్త - వేదాంతములున్.[4]

3
  1. నెఱుఁగ. ము.ప్ర. నెరఁగ వ్రా.ప్ర.
  2. బ్రహ్మ విష్ణువు మొదలగు మహాపురుషులకు, మనస్సుకు మాటలకు నందరాని శివస్వరూప మిట్టిదియని చూపెదను.
  3. వేదములు శివునితత్త్వ మనేకరీతుల నున్నదని చెప్పుచున్నవేగాని యాతత్త్వ మిదియని స్పష్టముగా చెప్పజాలవు.
  4. వేదాంతములును, నిదమిత్థమని నిర్ణయింపలేక, శివుని గూర్చి తెలిసికొనుట కింకను మార్గములు వెదకుచున్నవి.