పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ

వరుస సంవత్సరము బరివత్సరంబు, బ్రాహ్మణోత్తమ యివ్వత్సర మనువత్స
రమును వత్సరమును ననం బ్రభవముఖ్య, వత్సరము లైదుయుగ మన వసుధఁ బరఁగు

126


వ.

అందుఁ బ్రథమంబు సంవత్సరంబు, ద్వితీయంబు పరివత్సరంబు. తృతీయంబు
ఇవ్వత్సరంబు చతుర్థం బనువత్సరంబు. పంచమంబు వత్సరంబుగా నిట్లు
ప్రభవాది పంచవర్షంబులు సౌర, చాంద్ర, నక్షత్ర, సావనమాస వికల్పితం
బులై యుగ మనం బరఁగు. ఈభూమండలంబునకుఁ గడపలదైన లోకా
లోకశైలంబునకు దక్షిణంబును, నుత్తరంబును, వైషువంబును నన మూఁడు
శృంగంబులు గల వందు మేషతతులయందు మార్తాందుండు వైషువతీశిఖరం
బున నుండ దివారాత్రంబులు సమంబుగా నడచు. ఆసమకాలంబు విషువ
కాలం బనం బరంగి పుణ్యకాలం బయ్యె. అందు దేవ, పితృదానంబులు చేసి
కృతకృత్యు లగుదురు. శుక్లపక్షాంతంబు పౌర్ణమాసి యనం బరఁగు. కృష్ణ
పక్షంబు అమావాస్య యనం బరఁగు ఆపౌర్ణమాసికి రాకయు ననుమతి
యును, అమావాస్యకు, శిరవాలియు, కుహువు నను నామాంతరంబులు
కలవు. మాఘఫాల్గుణంబులును చైత్రవైశాఖంబులును జ్యేష్టాషాఢంబు
లును, శిశిరవసంతగ్రీష్మఋతువులు మూఁడు నుత్తరాయణంబు. శ్రావణ
భాద్రపదంబులును ఆశ్వీజకార్తికంబులును మార్గశీర్షపౌష్యంబులును
నను వర్షాశరద్ధేమంతఋతువులు మూఁడును దక్షిణాయనం బనం బరఁగు.

127


చ.

నరనుత చక్రవాళగిరి నాలుగుదిక్కుల లోకపాలురున్
పరమతపోధనుల్ సుగుణభాసురు లుత్తము లున్నతవ్రతుల్
దురితవిదూరు లుండుదురు దోహల మొప్పఁగఁ గర్దమాత్మజుల్
నిరతము లోకరక్షణమనీష నశేషజగద్ధితార్థులై.

128


వ.

వారలు సుధన్వుండును, శంఖపుండును, హిరణ్యరోముఁండును, కేతుమంతుం
డును ననం బరఁగుదురు. ఉత్తరంబు దేవయానమార్గ౦ బని చెప్పితిం గదా; దక్షి
ణంబు పితృయానమార్గంబు. అందు నగ్నిహోత్రులైన ఋషులు భూతారం
భకారియైన బ్రహ్మంబు చెప్పుచు సంతతతపోమర్యాదాశ్రుతంబులచేతఁ
బ్రతియుగంబులయందు బ్రహ్మస్థాపనంబు సేయుచుండుదురు. వారలమార్గం
బు గదా దక్షిణంబు. దక్షిణమార్గప్రవర్తనులు చచ్చుచుఁ బుట్టుచు యాతా
యాతంబు నొంది భూతసంప్లవపర్యంతంబు నుండుదురు. దేవయానమార్గంబై న
యుత్తరాయణంబునందు, ఇంద్రియజయశీలురును, బ్రహ్మచారులును, విమలు
లును, సంసారదూరులును, ఊర్థ్వరేతస్కులును నైన యతీశ్వరులు భూతసంప్లవ
పర్యంతంబును వసియించి యుండుదురు. వారలు లోభంబు లేమిని వ్యపాయ
వర్ణనంబున కామాదిదోషరాహిత్యంబున నమృతంబును బొందుదురు.

129