పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నావృతంబులై యుండు, ద్వీపసముద్రంబు లుత్తరోత్తరద్విగుణంబులై
యుండు.

60


చ.

శమగుణభూషణా! వినుము సర్వపయోధులనీరు తారకా
రమణుఁడు పూర్వశైలశిఖరంబునఁ దోఁచిన నస్తశైలశృం
గముకడ కేగినన్ గడఁగి గాఢతరస్థితి పొంగుఁ గ్రుంగు ని
త్యము శితకృష్ణపక్షములయందు సమందతరాద్భుతక్రియన్.

61


వ.

చంద్రోదయాస్తమయంబుల సముద్రోదకంబులు వెయ్యిన్నేనూఱంగు
ళంబుల పొడవు పొంగుచుం గ్రుంగుచునుండు. పుష్కరద్వీపనివాసులకు షడ్ర
సోపేతంబులైన భోజనంబులు తలంచినంతన తనకుఁదాన సంభవించు.
స్వాదూదకసముద్రంబునవ్వల ఈభూమండలికి నినుమడియై యేజంతువులును
లేనికాంచనభూమి కలదు. దానియవ్వల పదివేలయోజనంబుల వెడల్పు నంతియ
పొడవునుం దగ వలయాకారంబున లోకాలోకపర్వతంబు కలదు. అది తమో
వృతంబై యుండు. ఇవ్విధంబున.

62


క.

పంచాశత్కోటిసమ, భ్యంచితయై భూతధాత్రి బరఁగుచునుండున్
చంచద్ద్వీపాంబుధిగిరు, లెంచం దనమీఁద నుండు నిద్దప్రతిభన్.

63


గీ.

వినుము మునినాథ దెబ్బదివేలయోజ, నములదళ మిమ్మహీస్థలి యమితభూత
కోటి కాధారమై యుండు హాటకాంబ, రునివిలాసం బి దంతయు నని యెఱుఁగుము

64


శా.

భూవిస్తారసముచ్ఛ్రయంబు లతివిస్ఫూర్ణద్గతిం జెప్పితిన్
ప్రావీణ్యం బలరారఁగావినఁదగున్ పాతాళవిస్తారమున్
శ్రీవైచిత్ర్యములందు దైత్యదనుజశ్రేణీభుజంగేంద్రు లి
చ్ఛావృత్తి న్విహరించుచుండుదురు శశ్వద్భోగభాగ్యాఢ్యులై.

65


వ.

అతలంబు, వితలంబు, నితలంబు, గభస్తిమంతంబు, మహంబు, సుతలంబు,
పాతాళంబు నన నేడుభేదంబుల నొకటొకటి దశసహస్రయోజనపరివృతంబై
యుండు.

66


ఉ.

భూరివివేకపాక! కనఁ బొల్పగునందుల శుక్లకృష్ణపీ
తారుణవర్ణయుక్తిగల యద్రులు, భూములు, స్వర్ణరత్నశృం
గారసమేతసౌధములు కాంచనపుణ్యవనీనదీసర
స్సారససారసౌరభవశంవదసన్మదషట్పదంబులన్.

67


క.

లీలమెయి నారదుఁడు పాతాళంబుననుండి దేవతాపురికి సము
ద్వేలగతి వచ్చియింద్రుం, డాలింపఁగఁ జెప్పె నచటియతివైభవముల్.

68