పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పర్వతసంభవంబులు గోదావరీ, భీమనదీ, కృష్ణవేణ్యాదులు సహ్యపాదోద్భ
వములు. త్రిసామా, ఋషికుల్యాదులు మహేంద్రవత్పర్వతసంభవంబులు.
కృతమాలా, తామ్రపర్ణిప్రముఖనదులు మలయోద్భోవములు. ఋషికూలా,
కుమార్యాదులు శక్తిమత్పాదసంభవములు. వీనివలన నుపనదులు పెక్కు గలవు.
అందుఁ గురు, పాంచాలాదిమాధ్యదేశజనులును, బూర్వదేశాధినివాసులును,
మద్రధామాంబ, పారసీకాదులును, నీనదులజలంబులు ద్రావుచుఁ దత్స
మీపంబున హృష్టపుష్టజనాకులులై వసింతురు.

31


చ.

వరుసకృతంబు త్రేతయును ద్వాపరముం గలి సంజ్ఞితంబులై
పరగుయుగంబు లెప్పుడును భారతవర్షమునందగాని, కిం
పురుషముఖాష్టవర్షములఁ బొందవు దాన, తపో, ముఖక్రియల్
పరముగుఱించి చేయుదురు భారతవర్షమునందు సత్తముల్.

32


వ.

ద్వీపంబులందు జంబూద్వీపం బుత్తమంబు. దానియందు యజ్ఞపురుషుండైన
శ్రీమన్నారాయణుండు పురుషులచేత యజింపఁబడు. సత్పురుషులు పరలో
కార్ధంబు సత్క్రియలు చేయుదురు. తక్కినద్వీపంబుల నన్యప్రకారంబున
భజియింతురు. జంబూద్వీపంబునందు భారతవర్షంబు శ్రేష్ఠంబు. ఇది కర్మ
భూమి. తక్కినవి భోగమూలములు. అనేకజన్మసహస్రంబులకుఁ బుణ్యసంచ
యంబువలన జంతువు భారతవర్షంబునఁ బురుషుండై జనియించు ఈయర్ధంబు
నకు దేవగీతలు కలవు. వానియర్థంబు వినుమని శ్రీపరాశరుడు మైత్రేయున
కిట్లనియె.

33


చ.

అమృతస్వర్గమోక్షముల కాదరువై తగుభారతాఖ్యవ
ర్షమున జనించినట్టి పురుషప్రకరం బతిధన్య మె ట్లనన్
తమతమనిత్యకర్మసముదాయము తత్ఫలకాంక్ష మాని శ్రీ
రమణునిఁ జేర్చి పొందుదురు ప్రస్ఫుటతన్మహనీయధామమున్

34


చ.

తెలియక మోసపోతిమి కదీయత దెచ్చినకర్మ మింకినన్
పలుపలు కేల శీఘ్రమున భారతవర్షమునందుఁ బుట్టి నే
ర్పలవడ భక్తియుక్తి జలజాయతలోచను పాదపద్మముల్
గొలుతుము ముక్తికై తలఁపఁ గొంచెమె తన్మహితప్రభావముల్.

35


వ.

అని చెప్పి మఱియు నిట్లనియె.

36


గీ.

బ్రహ్మవిద్వర నవవర్షపరిమితంబు, లక్షయోజనవిస్తారలక్షితంబు
లైనయీదీవి చుట్టు చోద్యముగ నుండు, క్షారనీరధి లక్షయోజనమితంబు.

37