పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సుమతికి తైజనుండు, అతని కింద్రద్యుమ్నుండు, అతనికి పరమేష్ఠి, అతనికి
ప్రతిహారుండు, అతనికి ప్రతిహర్త, అతనికి త్వష్ట, అతనికి విరజుండు, అతనికి
రజుండు, అతనికి శతజిత్తు, ఆశతజిత్తునకు విష్వగ్జ్యోతిప్రధానులగు పుత్రులు
నూర్వురు జనియించిరి. వారిచే గదా యీభారతవర్షంబు తొమ్మిదిభేదంబుల
నలంకరింపంబడియె. తదన్వయప్రసూతులైన మహీపాలకులచేత ఇబ్భారత
మహీమండలం బనుభవింపంబడియె. వరాహకల్పంబున నేకసప్తతి, చతుర్యుగ
పరిమితంబైన, స్వాయంభువమన్వంతరంబున నీస్వాయంభువసర్గంబు ప్రవ
ర్తిల్లె. ఇందుచేత జగంబు పూరితంబయ్యెనని చెప్పిన మైత్రేయుం డి ట్లనియె.

12


క.

స్వామీ! స్వాయంభువసర్గామితమహిమంబు వింటినంతయుమీఁదన్
భూమండలవిస్తారం బేమాడ్కిన్ బరుగు దాని నెఱిఁగింపఁగదే.

13


గీ.

సాగరంబులు ద్వీపవర్షములు గిరులు, నదులు కాననములు పట్టణములు ధరణిఁ
బరగు వీనిప్రమాణ మెప్పగిది వీని, కేమి యాధార మింతయు నెఱుఁగఁ జెపుమ.

14


వ.

అనిన శ్రీపరాశరుం డి ట్లనియె.

15


క.

ఓమునినాయక! వినుమా! భూమండలి తెఱఁగు సర్వమును చెప్పఁగ వా
గ్భామాపతికైనను రా, దీమెయి సంక్షేపభంగి నెఱిఁగింతుఁ దగన్.

16


వ.

జంబూప్లక్షశాల్మలకుశక్రౌంచశాకపుష్కరనామంబులం గల సప్త
ద్వీపంబులు క్రమంబున లవణేక్షుసురాసర్పిదధిదుగ్ధశుద్ధజలసముద్రంబుల
చేతం బరివేష్టితంబులై యుండు. ఈసప్తద్వీపంబులకు జంబూద్వీపంబు
మధ్యసంస్థితంబై యుండు. తన్మధ్యంబున నెనుబదినాలుగువేలు యోజనంబులు
పొడువును, పదాఱువేలయోజనంబులు పాతును ముప్పదిరెండువేలయోజనం
బుల శిరోవిస్తారంబును పదాఱువేలయోజనంబుల మూలవిస్తారంబును గలిగి
భూపద్మంబునకు కర్ణి కాకారంబై కనకమయంబైన మేరుపర్వతంబు వెలుంగు.

17


సీ.

హిమగిరి హేమకూటము నిషధము నన మేరుదక్షిణవర్షమేదినీధ
రములు నీలాద్రిశ్వేతమహీధరము శృంగవంతంబునఁగ సువర్ణశిఖరి
ఉత్తరవర్షభూభృత్తిలకములందు హేమకూటము శ్వేతభూమిధరము
లక్షయోజనదైర్ఘ్యలక్షితంబులు తక్కునాలుగు తొంబదివేలు యోజ


గీ.

నముల నిడుపున వెలయు నున్నతియు వెడలు, పును సహస్రద్వయమితమై పొల్చువర్ష
గిరివరంబుల కాఱింటికిని గణింప, ధీరవర వీనివిధమెల్లఁ దెలిసికొనుము

18


వ.

దక్షిణలవణాబ్ధిహిమవత్పర్వతమధ్యంబు భారతవర్షంబు, హిమవద్ధేమకూట
పర్వతమధ్యంబు కింపురుషవర్షంబు, హేమకూటనిషధపర్వతమధ్యంబు హరి