పుట:విక్రమార్కచరిత్రము.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

11


దాలిమిపేర్మి నీతరుణిలలామకు
        నెన లేరు ధారుణీవనిత దక్క
సౌభాగ్యగరిమ నీసాధ్వికి నుపమింప
        లక్ష్యంబు లేరు శ్రీలక్ష్మి దక్క


తే.

రూపమున నీవధూమణిఁ జూపి చెప్ప
జోడు లేరు సురాధిపుసుదతి దక్క
ననఁగఁ బుణ్యపుముడి మోచి యక్కమాంబ
బంధువులపాలిసురభినాఁ బరఁగె ధరణి.

47


క.

ఆరమణీరమణులకును
శ్రీ రంజిల్లంగ నవతరించిరి విభవో
దారుఁడు సిద్ధనమంత్రియు
నారూఢయశుండు భైరవామాత్యుండున్.

48


సీ.

సొబగుమైఁ గనువిచ్చి చూడ నేర్చిననాఁడె
        సుజనులఁ గరుణతోఁ జూడ నేర్చె
మవ్వంబు దళుకొత్త నవ్వ నేర్చిననాఁడె
        నయమార్గహీనుల నవ్వ నేర్చె
నడుగెత్తి యల్లన నడవ నేర్చిననాఁడె
        ననిచి ధర్మముత్రోవ నడవ నేర్చె
లలిఁ దొక్కుఁబల్కులు పలుక నేర్చిననాఁడె
        పరికించి సత్యంబు పలుక నేర్చె


తే.

వ్రాయ నేర్చిననాఁడె సద్వర్ణసమితి
[1]నర్థి నర్థము ప్రబల వ్రాయంగ నేర్చె
బాల్యమునయంద బహుకళాప్రౌఢి మించెఁ
జిరయశోహారి జన్నయసిద్ధశౌరి.

49


సీ.

చిత్రగుప్తునకైనఁ జింతింప నరుదైన
        గణితవిద్యాప్రౌఢి ఘనత కెక్కె
నవరసంబులయందు నవ్యకావ్యంబులు
        కవిజనంబులు మెచ్చఁగా నొనర్చె

  1. నర్థి నర్థులు ప్రబల వ్రాయంగ నేర్చె, అని వావిళ్ల. 1926.