పుట:విక్రమార్కచరిత్రము.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

ప్రాచీనాంధ్ర మహాకావ్యములలో విక్రమార్కచరిత్రము లెక్కింపదగినది. విక్రమార్క మహారాజు జీవితమును వర్ణించు కావ్య మిది యని దీని పేరే తెలుపుచున్నది. 'చరిత్ర' నామముతో రచింపఁబడిన కావ్యములు దీనికి ముందు వెనుక లందును వ్రాయఁబడుచుండినవి. పండితారాధ్యచరిత్రము, దశకుమారచరిత్రము మఱియుఁ గేయూరబాహుచరిత్రములు దీనికిఁ బూర్పరచనలు, మను, వసుచరిత్రాదు లనంతరకృతులు. పండితారాధ్యచరిత్రము శైవమతప్రచారకుఁడును, గురుస్థానీయుఁడు నయిన మల్లికార్జున పండితారాధ్యుని జీవితవిశేషములను వర్ణించు ద్విపదకృతి. ఇట్టివానిలో నిది మొదటిది. దశకుమారచరిత్రము దండి సంస్కృతగద్యకావ్యమునకుఁ బద్యానువాదము. ఇది బహునాయక మగు కల్పితకథాసంపుటి. ఇట్టివానిలో నిది యాద్యము. కేయూరబాహుచరిత్రము సంస్కృతనాటికకుఁ బద్యానుకృతి ఐనను నిందు నీతికథ లనేకము క్రొత్తగా కవిచేఁ జేర్పఁబడినవి. ఇట్టి వానిలో నిదియే మొదటిది, తుదిది గూడ. తరువాతి కవులును సంస్కృతనాటకముల ననువదించినను వారు తమ కావ్యములయం దిట్లు నూత్నకథలను జేర్చరయిరి. ఈ విక్రమార్కచరిత్ర నాయకుఁడు లోకోత్తరగుణసంపన్నుఁ డగు విక్రమార్క మహారాజు. ఇతఁడు చారిత్రకపురుషుఁడే కాని, అతిలోకమహిమోపేతుఁడు. ఈయన సాహసౌదార్యపరాక్రమాది గుణస్ఫోరకము లగుకథ లనేకము లిందు వర్ణితములు. ఇట్టి వానిలో నిదియే మొదటిది.

దశకుమారచరిత్రాదు లాంధ్రసాహిత్యమునఁ గథాకావ్యములుగాఁ బరిగణింపఁబడుచున్నవి. దశకుమారచరిత్రము నందలి కథలు విడివిడిగాఁ బదుగురకు సంబంధించిన వగుటయే కాక పరస్పరసంబంధ మంతగా లేనివి. కేయూరబాహుచరిత్రము నందలి కథలు పైనుండి ప్రత్యేకముగాఁ జేర్పఁబడి ప్రధానకథతోఁ గాని, కథానాయకునితోఁ గాని బొత్తిగా సంబంధము లేనివి. వీనిని తొలగించినచో 'కావ్యము మఱింత రసవంత మగునేకాని, దాని కెట్టి న్యూనతయు వాటిల్లదు. ఈ విక్రమార్కచరిత్రము నందలి సమస్తకథలును నతనితో అత్యతసంబంధము కలవి. ఇందుండి కొన్నిటిని తొలఁగించితిమేని నాయకుని యుత్తమగుణములకుఁ గొంత న్యూనత నాపాదించిన వారమగుదుము. ఇది యీ కావ్యవైలక్షణ్యము.