పుట:విక్రమార్కచరిత్రము.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

విక్రమార్క చరిత్రము


వ.

సకలసైన్యసమేతుండై వాహ్యాళివిహారంబున కరుగుచున్నభర్తృహరికిం దత్ఫలంబు దృష్టిగోచరం బగుటయు.

19


ఆ.

దానిఁ జేరఁ బిలిచి, తత్పాత్రలోనున్న
పండు పుచ్చుకొని యతండు నగుచు,
వెండి యొక్కపండు విప్రుఁ డెప్పుడొ తెచ్చి
తనకు నీక, యమ్మికొనియె ననుచు.

20


ఉ.

అప్పుడు విప్రు రాఁ బనిచి యవ్విభుఁ డిట్లను, రెండుపండ్లు నీ
వప్పరమేశుచేఁ బడసి యందొకఁ డిచ్చి యొకండు దాఁచుకో
నిప్పుడ కానవచ్చెఁ, జనునే యిటు వంచన సేయ? నన్న వా
[1]తప్పక యాఫలంబె, వసుధావర దీనికి నెట్లు చేరెనో!

21


వ.

అనిన విని యన్నరేంద్రుండు.

22


క.

గోమయహారిణిఁ గనుఁగొని
యేమిగతిన్ దొరకె నీకు నీఫల? మనుడున్
ఆమగువ దెలుపఁ క్రమమున
నామర్మము దెలిసెఁ దత్తదంతరసరణిన్.

23


వ.

అత్తెఱం గంతయుఁ గరతలామలకంబుగా నెఱింగి.

24


క.

తనప్రియకాంత యొనర్చిన
యనుచితకర్మశిఖి, యంతరంగము నంగం
బునఁ బరితాపము సేయఁగ
వనజాతేక్షణల రోసి, వసుధేశుఁ డనున్.

25


మ.

[2]హరిణీలోలవిలోచనామధురలీలాలాపరీతుల్, మనో
హరకేళీనవరూపయౌవనమదవ్యాపారముల్, రాగసా
గరనిర్మగ్నులఁ జేయవే మగలఁ! దత్కౌతూహలంబు న్మదో
ద్ధురదంతిశ్రవణానిలం, బని తలంతు ర్గాదె మేధానిధుల్.

26
  1. తప్పక తత్ఫలం బొకటి తప్పదు లే దితరంబు నావుడున్. అని పా.
  2. మ. కరకాబద్ధసురాలయంబులు, మహాకాండోపరిం జిత్రతా
    స్ఫురణల్, స్వప్నసువస్తులబ్ధనిరతుల్, శుంభత్ఫలాలేపముల్
    కరికుంభస్తనిచిత్తవృత్తములు, దత్కౌతూహలంబు న్మదో
    ద్ధురదంతిశ్రవణానిలం బని తలంతుం బూర్వవాక్పద్ధతిన్. అని పా.