పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

158

వాసిష్ఠరామాయణము

వ. సకలదుఃఖదము, సకలవిషయోన్ముఖము, నగు మనంబును విజ్ఞా
     నాదిచ్యుతికలనారహితుం డగుజీవునందును, జడం బగుదేహంబునం
     దును, నాత్మస్వరూపంబు వేద్యనిర్ముక్తం బై శుద్ధసంవిత్సారం బై
     యుండుం గాని, యితరంబు గాదు.240
క. అని నిశ్చయించి యపుడ
     మ్ముని యాసలు వీడి చిత్తమును బలవంతం
     బున నిల్బి యింద్రియంబుల
     పనుల నణఁచి చిరసమాధిపదమున నుండెన్.241
సీ. అబ్భంగి నుండంగ నతనిప్రాణంబులు
                    క్రమయుక్తిలోననె శమముం నొందె;
     నబ్జకోరకభాతి నరగంటిచూడ్కులు
                    కొమ రొంద నాసికాగ్రమున నిగుడ,
     మేనియుగ్గులు మాన్చి మెదలక చిత్రరూ
                    పముభంగిఁ బర్వతభాతి నుండె
     నట్లుండి వింధ్యగుహాంతరంబున ముహూ
                    ర్తముభంగి వర్షశతత్రయంబు
గీ. నిర్వికల్పసమాధిమై నిలిచియుండఁ,
     గాయ మతనిది ధరణిపంకమున మునిఁగి,
     యున్న చో టేర్పఱుప రాక యుర్విఁ గలిసి
     యుండె, నే మందు నమ్మునియుగ్రతపము!242
వ. ఇవ్విధంబున మున్నూఱేండ్లకుఁ బరమసమాధివలన మేల్కని పూర్వ
     నిష్ఠితం బై యనేకజన్మసంచితం బగుకర్మఫలంబు తపఃఫలంబుపోలెఁ
     దోఁచుటయు, నతండు మనోరాజ్యంబున సర్వంబు ననుభవించుచుండె.
     నది యె ట్లనిన, జనులకు జాగ్రత్స్వప్నమనోరాజ్యంబు లనం గర్మఫ
     లానుభవావస్థలు మూఁడువిధంబు లై యుండు. నందుఁ దెలివి