పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

157

     నెనయ నవిశిష్ట మగుపద మద్ది, యదియ
     యఖిలవేదాంతవాక్కుల కందరాని
     సర్వసంపూర్ణ మైనసుజ్ఞాన మధిప.233
వ. అట్లు గావున సర్వంబును బ్రహ్మం బగునెఱుకయ పదార్థదర్శిత్వం
     బగు. నిట్టి యోగజ్ఞానవివరణంబులకు నిదర్శనం బొక్కటి సెప్పెద.
     సావధానుండ వై వినుము.234
చ. ఘనుఁడు శ్రుతి స్మృతి ప్రహిత కర్మపటిష్ఠుఁడుఁ వీతహవ్యుఁ డ
     న్మునివరుఁ డెల్లకర్మముల మున్కొని పాసి విరక్తచిత్తుఁ డై
     వనమున నేకతంబ గరువం బగుయోగసమాధినిష్ఠమైఁ
     జని వెలి సర్వమున్ మఱచి శాంతమనోగతి నుండె రాఘవా.235
వ. ఇట్లు బాహ్యాభ్యంతరంబు లగు నింద్రియార్థంబు లుపసంహరించి
     నిర్మలం బగునంతరంగంబున నిట్లని వితర్కించె.236
క. కటకట ప్రత్యాహారం
     బిటు సేసిన నైనఁ జలన మొందుచుఁ గడు సం
     కటపడుచున్నది చిత్తము,
     పటువిచలిత మైనజీర్ణపర్ణము భంగిన్.237
గీ. సర్వసాక్షియు నజుఁడును సముఁడు నైన
     చిన్మయాత్ముండు జగములు సేయుచుండు,
     నకట యింద్రియగణము నిరర్ధకంబ
     యా కలంకముఁ బొందెడి ననుదినంబు.238
మత్తకోకిల. పాములం గని డాయనోడెడు పాంథుకైవడి, మాలలన్
     వేముఱుం గని డాయరోసిస విప్రు చాడ్పున, నింద్రియ
     స్తోమవృత్తికి నెల్లప్రొద్దును దూర మై వెలుఁగొందు వీ
     తామయంబును చిన్మయంబును నైన యా పరమాత్మ దాన్.239