పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

155

గీ. జడము నజడంబు నైన దృక్సరణినడుమఁ
     దలఁపఁ బరమర్థ మై యెద్ది వెలుఁగు నదియ
     బహువిధజ్ఞానబోధకోపనిషదర్థ
     విదులచేఁ జెప్పఁబడెడి వివేకనిలయ.220
వ. దృశ్యదర్శనాసంబంధం బై యనుభూతం బై పారమార్థికం బైన
     సుఖం బెద్ది యదియ బ్రహ్మం బనంబడుఁ. గాని ముక్తి యన నాకా
     శంబునను భూతలంబునను బాతాళంబునను లేదు. నిఖలాశాపరిక్ష
     యం బైన మోక్షం బగు నందు;౼221
గీ. అన్యపురుషానురక్త యౌనతివ యింటి
     పనులు వేడుకఁ జేసినభంగి ధీరుఁ
     డఖిలక్రియలను వెలిఁ జల్పి యంతరంగ
     మునం జిదానందసౌఖ్యంబు ననుభవించు.222
చ. దినమణి చల్ల నైన, హిమదీధితి తీవ్రత నెండ గాసినన్
     అనలుండు వేర్చి క్రిందుశిఖ లై ప్రసరించిన, నాత్మసక్తు లే
     యనువున నైన విస్మరణఁ జెందక యుందురు గాని, యెట్టి చొ
     ప్పును గని విస్మయంబు మదిఁ బొందరు రాఘవచంద్ర యెప్పుడున్.223
వ. అనిన విని రాఘవేశ్వరుండు వసిష్ఠున కి ట్లనియె.224
క. ఏమిటఁ జరించు చిత్తం?
     బేమిటఁ జలనం బణంగు? నీ రోగము నే
     నేమందున నణఁగింపుదు?
     ధీమన్నుత యవ్విధంబు దెలియఁగఁ జెపుమా. 225
క. అనిన వసిష్టుం డి ట్లను,
     విను కల వందులకు రెండు వెరవులు యోగం
     బును సుజ్ఞాన మనంగాఁ
     బనుపడ నివి తెలియ వినుము భానుకులేశా.226