పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ

వరాహపురాణము

ప్రథమాశ్వాసము

అవతారిక

ఇష్టదేవతాస్తుతి

శా.

శ్రీకాంతాకుచహారకౌస్తుభ[1] మణిశ్రీ లాత్మవక్షః[2]స్థల
వ్యాకీర్ణత్వము [3]నొంది [4]చూపఱుకు నుద్యద్గంధకాశ్మీరచ
ర్చాకారంబు భజింప మించిన సరోజాక్షుండు, [5]రక్షించు, ధై
ర్యాకల్పుం గొలిపాక సర్వవిభు నెఱ్ఱామాత్యచూడామణిన్.

1


ఉ.

 శైత్యవిశేషశైలమున సంభవమందిన పాలు, జన్మసాం
గత్యము లేని పాలు, గల కాయమునన్ జగదేకచిత్రదాం
పత్యముఁ దాల్చు శంభుఁడు, కృపాయుతుఁడై కొలిపాక యెఱ్ఱయా
మాత్యున కిచ్చు [6]వాంఛితసమంచితసౌఖ్యచిరాయురున్నతుల్.

2


ఉ.

అంబుజనాభునాభిసముదంచితతామరసాలవాలమ
ధ్యంబున నంకురించి, నిగమాయతశాఖము, శారదాలతా
లంబనమున్, జగత్త్రయఫలంబునునైన విరించి కల్పభూ
జం, బొసఁగుం గృతీశుఁ డగు - సర్వయ యెఱ్ఱయ కీప్సితార్థముల్.

3


శా.

మాణిక్యాంగుళిముద్రికా[7]నఖరుచుల్ మార్మాటికిం బర్వఁగా,
వీణాదండము చిత్రవర్ణముగ, నావిర్భూతనాదామృత
శ్రేణీపూరితరాగసాగరమునం గ్రీడించు వాగ్దేవి, క
ల్యాణశ్రీయుతుఁ జేయు సర్వవిభు నెఱ్ఱామాత్యదేవేంద్రునిన్.

4


సీ.

గండ [8]మండలగళద్ఘన దానధారల । నిందిందిరములకు విందుచేసి,
శేఖరీకృతమౌళిశీతాంశుచంద్రికా । రసమున మదచకోరములఁ [9]దనిపి,
శ్రవణచామరసమీరమునఁ గండలిరాజ । యజ్ఞసూత్రమున కాహార మొసఁగి,
కరపుష్కరాగ్రనిర్గతవారికణములఁ । జాతకశ్రేణి కుత్సవ మొనర్చి,


తే.

భూరివిఘ్నాద్రి[10]కూట దంభోళి యనఁగ । హితజనస్వాంతపంకజహేళి యనఁగ
నలరు గణపతి, యిష్టార్థముల నొసుగు । నెలమిఁ గొలిపాక యెఱ్ఱమంత్రీశ్వరునకు.

5
  1. మణీశ్రీ - మ, మా, హ
  2. స్థలా - అన్ని ప్ర.
  3. సెంది - త, తా
  4. భూవరకు - క
  5. శ్రీ లిచ్చు - హ
  6. ఁగావుత - మ, తి, తి, హ, ర, క
  7. నఘ - మ, తి. హ, ర, క; ఘన - త
  8. ద్వయీ - తా
  9. దగిలి - మ, తా, ర, క
  10. కోటి - తా