పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

19

భసితసంజాతదనుజులతపము శివసాక్షాత్కారము

చ.

అఱువదివేలు ని ట్లుదయమంది గదాశరభిండివాలతో
మరముఖరాయుధాగ్రముల మస్తకముల్ గదియించి, మీఁదికిం
జరణము లూఁతగాఁ దపము సల్పిరి శంభునిఁ గూర్చి, రౌప్యభా
స్వరగిరి వాయుకోణగతి చంద్రమతీతటినీతటంబునన్.

64


సీ.

సతతమార్దవధర్మశార్దూలమృగచర్మ | శాటితో, ఫణి[1]తులాకోటితోడ,
ఘనసారనక్షత్రకాంతిభాసురగాత్రపుష్టితో, నిటలాగ్రదృష్టితోడ,
గంగా పయఃపూరకలితజటాభారసీమతో, వామాంగభామతోడ,
సేవార్థనిస్తంద్రదేవపారిషదేంద్ర | చయముతో, గోరాజహయముతోడ,


తే.

జింకతో, మౌళిఁగ్రొన్నెలవంకతోడ, | నొప్పు[2]తో, గళమూలంపుఁగప్పుతోడ,
హరుఁడు ప్రత్యక్షమయ్యె భక్తార్తిహరుఁడు ! దైత్యులకు, నుగ్రతరతపోనిత్యులకును.

65


క.

అప్పుడు దానవవీరులు | ముప్పిరిగొను భయముఁ బ్రణయమును విస్మయముం
జిప్పిల, నతులై యిట్లని | యప్పరమేశ్వరునిఁ బొగడి - రతులితభక్తిన్.

66


పరమశివస్తుతి

సీ.

పురహర! శశిజూట! భూతేశ! శాశ్వత! | నిర్మల! నిరవద్య! నిర్వికల్ప!
ఈశాన! శంకర! హిమశైలజానాథ! | హర! మహేశ్వర! శూలధర! గిరీశ!
నిత్య! మృత్యుంజయ! నిర్వాణ[3]నాయక! | వేదాంతవేద్య! బ్రహ్మాదివంద్య!
అంధకాసురదర్పహరణ! చర్మాంబర! | వృషభేంద్రవాహన! విషమనేత్ర!


తే.

ఫాలలోచనకోణాగ్రభాగనిర్య | దనలకణమాత్రనిష్పీతమనసిజాంగ!
భసితచందనచర్చావిభాసమాన! | పన్నగాధీశభూషణ! భక్తవరద!

67


చ.

అమలయతీంద్ర[4]చిత్తమణిహర్మ్యములం దొకవేళ సూక్ష్మరూ
పమున వసింతు, వొక్కపరి పద్మభవాండము పాదుకాతప
త్రముల విధంబుగా గరిమఁ దాల్తువు, పర్వతకన్యకాసమా
గమసుఖ[5]సక్తి నొక్కపుడు - గాంతువు యోగ్యగృహస్థధర్మమున్.

68


క.

ఒకమఱి సర్వము నీవై | యకలంకత నిల్తు వణుమహద్భావమునన్
సకలేశ్వర! నీతత్త్వము | ప్రకటంబుగఁ దెలియవశమే బ్రహ్మాదులకున్?

69
  1. కులకోటి - తా,తి,తీ,హ,గ,క
  2. తోడుత గళమున - తి,తీ,హ; తోగర - త,మా; గరమూలకప్పు - మా
  3. దాయక - తీ
  4. చిత్ర - మ,త,తీ,హ,ర,క
  5. పంక్తి - తి,తీ