పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఖర్జువులు సంగరరమార్జనసముద్యమనధూర్జవములన్ మెఱయ నిర్జడిమకీల
స్ఫూర్జితలలాటశిఖిభర్జితపురత్రితయధూర్జటి యనం గనలి గర్జిలుచు వీఁకన్.

26


సీ.

ముందట బలభేదిముఖ్యదిక్పతివిభాళా యని బహుకాహళములు మొరయ
గంధదంతావళగ్రైవేయఘంటాఘణాత్కారముల నజాండంబు లవియ
కంఖాణతురగరింఖాపుంఖితక్షమాధూళి నభ్రపథంబు దూటుకట్ట
పరభయంకరవీరభటభుజభ్రమితాయుధవ్రాతములు ధళధళ యనంగ
కఠినతరనేమిచక్రసంఘట్టనముల, నురగపరివృఢఫణపరంపరలు చదియఁ
గదియ నడిచి నిశాతాశుగములగములఁ, దెఱపిగని శత్రుసైన్యంబు నఱకువేళ.

27


క.

కనుపట్టె రాహువదనం, బునఁ జిక్కినసూర్యబింబమో యనఁగా న
ల్లనిగరి గలశితసాయక, మునఁ దగిలి విరోధికనకముకుటము మింటన్.

28


గీ.

మెడలు దునిమిన మీఁదికి వెడలురుధిర, ధారల మధాంధపరిపంథివీరభటక
బంధములు నిల్చెఁ చెక్కులు పగలుబిరుదు, బంట్లు పట్టించుకొనుదివ్వెపౌఁజు లనఁగ.

29


క.

కులిశహతిరుధిరజనిత, స్ఫులింగనివహంబుచందమున నెగసెఁ గృపా
ణలతాదళితాహితగజ, ములకుంభంబుల సరక్తముక్తాఫలముల్.

30


చ.

అరిమకుటీవిటంకముల నాయపదండపటుప్రహారచా
తురిఁ గురువిందరత్నములు దూలి ధరం బడు వీరపుంగవుల్
పొరిఁబొరి ప్రక్కలించుకొనిపోవ నభోమణిమండలఁబునం
దొరిఁగెడుదీప్తిఖండములతోఁ దులదూఁగుచు నన్నివంకలన్.

31


క.

అమరత్వమునకుఁ బోవుచుఁ, దమభవబంధంబు లూడఁదన్నుకొనుగతిన్
సమరోర్వి నిమిషమాత్రం, బు మదారాతులకబంధములు దన్నుకొనున్.

32


చ.

వరవరణాభిలాషమున వారిజపత్రవిలోచనల్ పురం
దరపురినుండి శీఘ్రగమనంబున రాఁ గుచఘర్మవారిచే
గరఁగినకుంకుమద్రవము గాఱెడుకైవడిఁ గాఱఁజొచ్చె నం
బరవలమానలూనరిపుమ సపరిస్రవదస్రబిందువుల్.

33


గీ.

కదనధాత్రీతలమున హుంకారగర్భ, మై పడినశత్రుమస్తకం బాడుతనక
ళేబరము చూచి మెచ్చి బళిబళీ యటంచుఁ, గొనియాడువిలసనం బభినయించె.

34


గీ.

గంధదంతావళము రేసి కఠినదంత, కాండమునఁ బొడ్చి యెత్తినఁ గానఁబడియె
సమదశాత్రవమణిమయస్యందనఁబు, కపటకిటికొమ్ముమొన రత్నగర్భవోలె.

35


గీ.

ఒక్కభటుఁ డొక్కవిద్వేషి నుఱికి పొడువఁ, బోటుగంట్లలో వెళ్ళి పొడుచువాని
పైఁ బడియె రక్తములు పోటు పడినవాని, క్రోధరసపూరములు ముంచుకొనియె ననఁగ.

36