పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

చని ఫల్గునీనదీసలిలపూరమునఁ గృతస్నానుఁడై గధాధరునిఁ గొల్చి
పితృపర్వతము చేరి పేరెలుంగునఁ గులగోత్రనామములు వాక్రుచ్చి సత్తు
సత్తుగాఁ జల్లె హస్తములు మీఁదికి నెత్తి పితృగణంబులను బేర్పేరఁ బిలిచి
క్షేత్రోపవాసంబు చేసి తద్దివసంబు గడపి సూర్యోదయకాలమునకు
నిత్యనైమిత్తికము లైననియమవిధులు, దీర్చి పిండప్రదానవిధిని సదర్భ
మాషగోధూమయవచూర్ణమధుతిలాది, సముచితద్రవ్యములు చాల సంతరించి.

78


క.

తా వచ్చె వెంటఁ గొల్చి గ, యావాసులు రా యతాత్ముఁడై పితరులకుం
గైవల్యపదము చేరఁగ, నావట మన నొప్పునక్షయవటంబునకున్.

79


శా.

ఈచందంబున వచ్చి, తద్వటమహీజేంద్రంబుక్రింద న్విశి
ష్టాచారోచితకృత్యముల్ జరపి కంజాప్తుండు మధ్యాహ్నలీ
లాచాతుర్యము చూపఁ జూపఁదగుకాలానం బితృవ్రాతమున్
జేచాపంగ మహామునీశ్వరుఁడు చేసెన్ బిండదానక్రియల్.

80


క.

హరహరివిధిగుహవైశ్వా, నరత్రయాదిత్యశశిగణపతిక్రౌంచా
మరవరకుంభజకశ్యపచరణంబులమీఁదఁ బిండషండము నిలిపెన్.

81


వ.

మఱియు జిహ్వాలోలరామగయాదివిశేషంబులం బైతృకక్రియాకలాపంబులు నిర్వ
ర్తించి కృతకృత్యుండై కొండొక కాలంబు ఘోరతపం బాచరింప నొక్కనాఁడు
త్రసరేణుపరిమాణంబును మధ్యందినమార్తాండమండలప్రభావిభాసమానంబును నైన
విమానం బెక్కి పరమాణుసమానదేహుండు దివ్యపురుషుండు ముందఱఁ బ్రత్య
క్షంబై.

82


గీ.

బ్రహ్మవిజ్ఞానసూనసౌరభ్య రైభ్య, యిట్టి ఘోరతపోనిష్ఠ నేమి కార
ణంబునకు నున్నవాఁడవు నాకుఁ జెప్పు, మనుచు నాశ్చర్యకరముగా నంతలోన.

83


మ.

అతిసూక్షాకృతి మాని కైకొనె మహీయత్వంబు సప్తాబ్ధివే
ష్టితవిశ్వంభర నిండె నంబరము దాఁటెన్ సర్వదిక్కుంభికుం
భతటప్రాంతము లాక్రమించె నిఖిలబ్రహ్మాండము ల్మీఱె నా
త్మతనూదీప్తులు క్రొమ్మెఱుంగుల హసింపం దద్విమానంబుతోన్.

84


క.

అతనికి వినయాన్వితమతి, యతిపతి నతి చేసి పలికె నప్పటినీసూ
క్ష్మత యిప్పటినీసంపూ, ర్ణత చూడఁగ విస్మయంబు నామదిఁ బొడమెన్.

85


గీ.

ఏమహాపురుషుండవో యెఱుఁగరాదు, మామకస్వాంతవిచికిత్స మాన్పు మనిన
వనరుహాసనవంశవర్ధన కృతార్థ, వత్స నినుఁ జూచువేడుక వచ్చినాఁడ.

86


క.

జనలోకనివాసుఁడ రు, ద్రునిగాదిలితమ్ముఁడన్ సరోరుహసంజా
తునిమానసపుత్రుఁడ నే, సనత్కుమారుండ ననిన సంయమి పల్కెన్.

87