పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

ఇంక శరీరవాయువు ధనేశ్వరుఁ డైనవిధంబు చెప్పెదం
బంకరుహప్రసూతికిఁ బ్రపంచవినిర్మితివేళ వెళ్ళ నా
తంకవిధాయి తీవ్రసికతల్ వెదచల్లుచు నూర్పుగాడ్పు కూ
లంకషసప్తసాగరజలంబులు తువ్వర గాఁగ రువ్వఁగన్.

7


క.

ఆపవనుం గనుఁగొని భా, షాపతి వారించి నీవు శాంతిపరుఁడవై
రూపంబు దాల్పు మనఁ దా, రాపరివృఢుఁ బోలుమూర్తి గ్రక్కునఁ దాల్చెన్.

8


సీ.

ఈరీతి శాన్తి వహించినపురుషుండు నలువపంపున దేవతలబలంబు
విత్తంబు రక్షించి విత్తేశ్వరాహ్వయంబున నిల్చె నాతండు జనన మైన
ఘస్ర మేకాదశిగాన నాఁడు నరుండు కథ విని వహ్నిపక్వంబు గాని
భక్ష్య మాహారింపఁ బ్రాపించు సకలసంపత్సౌఖ్యములు ప్రజాపాల యింక
నాదిమక్షేత్రమున మనం బైనవిష్ణు, దేవుఁడు ప్రయోజనార్థంబు దేహ మెత్తి
సంచరించుట సరసభాషావిజృంభ, ణమున వినిపింతు సావధానముగ వినుము.

9


వ.

నారాయణాత్మకుం డైనచతుర్ముఖుండు మున్ను తనవినిర్మించినసృష్టి గనుంగొని
యీసృష్టి పాలింప నాక తక్క నన్యులకు వశంబు గాదు గావున నమూర్తత్వంబు
మాని పాలనాసమర్థం బైనమూర్తి వహింతు నని చింతించుకాలంబున మనంబు పరి
గృహీతాపఘనంబై పురోభాగంబున నున్న నన్నిరవధికతేజఃప్రసారం బైనశరీ
రంబులోన నానాభువనంబులు ప్రవేశించిన విరించియు నించుకవడి విచారించి
తా మొదల వాగాదులకు నిచ్చినవరంబు దలంచి నీవు సర్వజ్ఞుండవు సర్వలోకనమ
స్కృతుండవు సర్వలోకకర్తవునై వర్తింపుము భవజ్జఠరంబున ముజ్జగంబులు ప్రవే
శించుటంజేసి పరమతపోధనవిధేయంబు విష్ణునామధేయంబు గలిగె నని పలికి
ప్రకృతిస్థితుం డయ్యె నప్పుడు.

10


గీ.

అప్రమేయుండు విష్ణుండు నాదికాల, బుద్ధి సర్వంబు మానసంబునఁ దలంచి
యోగనిద్రానుభవకేళి నోలలాడె, నింద్రియార్థాస్తరణభుజగేంద్రశయ్య.

11


సీ.

ఆతనినాభిరంధ్రాంతరంబున నొక్కపద్మంబు పుట్టె నాపద్మమునకు
విరివి సప్తసముద్రవేష్టితసర్వసర్వంసహ కర్ణిక రత్నసాను
వారత్నసానువుపై రవికోటిప్రభాభాసురం బైనబ్రహ్మగృహము
గనుపట్టె నేతత్ప్రకారప్రభావంబు గలవిష్ణు దుర్వారకలుషజిష్ణుఁ
గాంచి తద్దేవదివ్యవిగ్రహగతుండు, పరమపురుషుడు నేఁడు నా పనులు సిద్ధిం
బొందె నని సమ్మదంబునఁ బొదలి పొదలి, పలికె ని ట్లని గంభీరభాషణముల.

12