పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/30

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

భారతదేశపు ప్రాచీన కళాఖండాల విభాగానికి అమరావతి శిల్పాలను మార్చడం మూలంగా ఇతర భారతదేశ, భారత ఉపఖండంలోని శిల్ప సంపదతో వాటిని సరిపోల్చి చూడటానికి అవకాశం ఏర్పడింది. అంతే కాక, భారతదేశ శిల్పశాస్త్ర పరిణామ వికాసాలను, చారిత్రక నేపథ్యాన్ని కూడా అధ్యయనం చేయడానికి ఈ ఏర్పాటు ఎంతగానో ఉపకరిస్తుంది. ఈ ఏర్పాటును చూడగలిగి ఉంటే ఫ్రాంక్స్, ఇలియట్ ఇద్దరూ ఎంతగానో సంతోషించి ఉండేవారు.

1880లో అమరావతి పాలరాళ్లను బూమ్స్ బర్రీకి తెచ్చినపుడు మొదట వాటిని మ్యూజియం యొక్క సమున్నతమైన మెట్లపై ముఖ్యంగా మొదటి అంతస్తు వెనుక గోడకు, పక్క గోడలకు అమర్చడం జరిగింది. కూర్చున్న సింహాలను రెంటినీ మెట్లకు ఇరువైపులా క్రింది భాగంలో ఉంచడం జరిగింది. 1881 అన్నింటిలోకి బాగా ఉన్న 69 కళాఖండాలను గోడలకు అమర్చడం జరిగింది. మిగిలినవి రిజర్వులో ఉంచడమైంది. అమరావతి పాలరాళ్లను వాతావరణ ప్రభావం నుంచి, తుంటరి సందర్శకుల ఆకతాయి చేష్టల నుంచీ రక్షించవలసిన అవసరం ఉందని రిపోర్టు చేయగా, ఈ శిల్పాలకు గ్లాస్ ఫ్రేమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రాంక్స్ ఈ కళా ఖండాలను జేమ్స్ ఫెర్గూసన్ అనే వ్యక్తి తోడ్పాటుతో అమర్చాడు. అయితే ఈ శిల్ప తోరణాలు స్తూపాలకు చెందినవి కావు - ఇవి బౌద్ధ ఆరామాలకు చెందినవి అన్న ఫెర్గుసన్ అభిప్రాయంతో ఫ్రాంక్స్ సరిగానే విభేదించాడు. పూర్వపు ప్రదర్శనకు సంబంధించిన ఫొటోలు ఏవీ లభించకపోవడం దురదృష్టకరం

1860లో సేకరించిన ఇండియా మ్యూజియంలోని కళాఖండాల సముదాయానికి సర్ వాల్టర్ ఇలియట్ 1882లో అప్పగించిన మరొక కళా ఖండం చేరింది. ఇది ఒక డోలు ఆకారంలో గల అపురూప శిల్పం. ఫ్రాంక్ అభ్యర్ధన మేరకు మరొక కుడ్య చిత్రాల అడ్డ పలక మద్రాసు మ్యూజియం నుంచి 1885లో వచ్చింది. ఈ కళా ఖండాలన్నీ ఇప్పటికీ చెక్కుచెదరక చాలా చక్కని స్థితిలో ఉన్నాయి.