పుట:రుక్మిణీపరిణయము (కూచిమంచి తిమ్మన).pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

నగరివిశాలదేవభవనంబులపై విలసిల్లు నెల్లెడం
జిగిబిగికుందనంపుఁబని చేసినరత్నపుఁగీలుబొమ్మ లా
గగనమునందు నుండి పురిఁ గల్గువిలాసముఁ జూడఁగోరి వ
న్నెగ నరుదెంచి పాయ కటు నిల్చినయచ్చరకన్నెలో యనన్.

42


ఉ.

ఆనగరంబుత్రోవను దినాధిపుఁ డేఁగుచు దారి కడ్డమై
పూనికనున్నకోటఁ గని పోవఁగలేక యిరాఱుమేనులం
దానటు దిడ్లు చూఱి చనెఁ దథ్యము గాదని యంటిరేని యా
భానుని ద్వాదశాత్ముఁ డనిపల్కఁగఁ గారణ మేమి నిచ్చలున్.

43


గీ.

సరసులెల్లను బలుమాఱు సంస్తుతింపఁ, గువలయానంద మగుచు నక్కోటచుట్టుఁ
గడునలంకారవైఖరి గడలుకొనఁగ, పరిఖ దనరారు నెపుడు నప్పట్టణమున.

44


చ.

పురి కరిబృంద మందముగఁ బున్నమచందురుఁ గాంచి తెల్లదా
మరవిరి యంచుఁ దొండము లమందగతిం దివి కెత్తఁ దత్సుధా
కరుఁడు ననేకరాహువులుగా మది నెంచి భయంబు మించి దు
స్తరబహుళార్తిఁ గుందుచుఁ గృశత్వము నొందుఁ బదాఱువ్రక్కలై.

45


క.

నాగకకరికర్ణోదిత, సాగరముఖమదకదంబసాంద్రఝరీసం
యోగంబువలన జలధికి, సాగరనామంబు గలిగె జగము లెఱుంగన్.

46


క.

హరిణము లప్పురమునఁ గల, తురగంబులతోడఁ బోరి తుది నోడి మహా
త్వరితమునఁ బవనహిమకర, గిరిజేశుల శరణువొందె గేవలభీతిన్.

47


సీ.

తడఁబాటుగాఁ బల్కి తలకొట్లబడియెఁ దా వేదవేదియె యంచు వేధ నెంచి
జగ మెన్నఁ ద్రిదశవేశ్యకుఁ బుట్టెఁ దాఁ గులశ్రేష్ఠుఁడే యంచు వసిష్ఠు నెంచి
యనుజునిల్లాండ్రఁ గూడెను దాను సాధువర్తనుఁడె యంచును శుకజనకు నెంచి
ప్రకటింప సర్వభక్షకుఁడు తా నాచారవంతుఁడే యంచుఁ బావకుని నెంచి


తే.

వేదతత్వజ్ఞు లత్యంతవిమలకులులు, సాధువర్తను లవిరళాచారయుతులు
నైనధాత్రీసురోత్తము లనుదినంబు, పూన్కిఁ జెన్నొందుచుందు రప్పురమునందు.

48


చ.

అమరఁ బదాఱువ్రక్కలు నిరాఱుదెఱంగులు నైరి చెల్లఁబో
తమకులకర్త లైనశశితామరసాప్తు లంచు వారలన్
విమలయశఃప్రతాపముల విస్తరిలంగ నొనర్తు రొక్కటన్
హిమకిరణార్కవంశ్యు లయి హెచ్చినయప్పురిబాహుజోత్తముల్.

49


చ.

ధన మెపుడుం బుధావలి కుదారత మీఱ నొసంగి యెంతయున్
ఘనులనఁ బోలి యప్పురిఁ బ్రకాశతఁ గాంచిన వైశ్యకోటులన్
ధనదు లటంచు నెన్నక సదా ధనరక్షకుఁ డైనయక్కుబే
రుని ధనదుం డటంచును నరుల్ వచియించుట దోసమేకదా.

50