పుట:రుక్మిణీపరిణయము (కూచిమంచి తిమ్మన).pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నవరత్నధనధాన్యవివిధవస్తువులచే బలితంబు లగువైశ్యభవనములును
గోశాక్వరోష్ట్రసంకులములై సిరులచేఁ బొదలుచుండెడుశూద్రసదనములును


తే.

సతతనర్తితనర్తకీజనసరత్న, కనకమంజీరఘంటికాధ్వనులచేత
వలను మీఱెడుబహువేశవాటికలును, జూచి యుప్పొంగె ధారుణీసురవరుండు.

45


తే.

శంఖవరనీలకుందకచ్ఛపముకుంద, మకరపద్మమహాపద్మనికరములను
దనరునీరాజధానితో ధనదునగరి, సరి యగునె యంచు నవ్విప్రవరుఁడు పొగడె.

46


తే.

కేల గిరి యెత్తువరబలశాలి యగుటఁ, జేసి పేరైనపర్వతశ్రేణుల్లెల్ల
లీలఁ బెకలించి తెచ్చి యీప్రోలఁ గోట, యిడెనొ హరియంచు బుధుఁ డెంచె నిభకులముల.

47


క.

బంధురగతి నిచ్చోటున, గంధర్వావళుల నీనఁగాఁ బోలుఁ జుమీ
సింధువుకా కెటు లబ్బెన్, సైంధవనామంబు లంచుఁ జర్చ యొనర్చెన్.

48


తే.

కమలజావాస మెప్పుడు గలిగియుండు, విబుధలోకంబు నిబిడమై వెలయుచుండు
నాగవాసంబు మున్నె యిన్నగరి నలరు, నౌర పౌరుల కిఁక నొండు గోరవలదు.

49


క.

అని తలఁచుచుఁ జని భూసుర, తనయుఁడు వేడుకలు మీఱ దైత్యారినికే
తనభూమిఁ జేరి యొయ్యనఁ, దనరాక యదూద్వహునకుఁ దగ నెఱిఁగించెన్.

50


చ.

విని హరి నీలవర్ణుఁ డరవిందభవాన్వయుఁ దోడితెం డటం
చును దగువారలం బనుప సూరిజనోత్తముఁ జేరి వారు వం
దనము లోనర్చి మి మ్మిపుడు దానవసూదనుఁ డాదరించి గొ
బ్బునఁ బిలుఁ డంచుఁ బంచె నృపపూజిత ర మ్మిఁక నంచుఁ బల్కినన్.

51


తే.

శౌరిఁ గన్గొనుభాగ్యంబు సంభవించె, నంచు నెంతయు సంతసం బాత్మ నలర
వారితోడనె యవ్విప్రవరుఁడు కాంచ, నాంబరునిమందిరముఁ జొచ్చి యరుగునపుడు.

52


సీ.

క్షీరవారాశివీచిక లంచు మది నెంచు హీరసోపానంబు లెక్కుచోటఁ
బ్రావృడ్ఘనాఘనపంక్తు లంచుఁ దలంచు హరినీలభిత్తికల్ దఱియుచోటఁ
గ్రతుభుగ్ధరాధరకటకంబు లని యెంచుఁ గనకవితర్దికల్ గాంచుచోట
నమృతకాసారంబు లని యాత్మ నూహించు విధుశిలాతలములు వెలయుచోట


తే.

నహికులేంద్రఫణాగ్రంబు లంచు నెంచు, నబ్జరాగకవాటంబు లలరుచోట
సాంద్రచంద్రాతపము లంచు సరవి నెంచు, విమలమౌక్తికసౌధంబు లమరుచోట.

53


సీ.

పగడంపుగుండ్రగంబములు బాజుల నిల్పి పన్నినముత్యాలపందిరులును
నవహరిన్మణిమయద్వారతలంబులఁ బాటిల్లుహీరకవాటములును
దతపుష్యరాగనిర్మితవిటంకములచే వెలయుక్రొన్నెలరాలవేదికలును
జకచకద్యుతులఁ గొంచక చెలంగి వెలుంగుమేలినీలపుగుడ్యజాలకములు


తే.

నబ్జరాగశిలావలికాంచలప్ర, లంబనవనవరత్నకదంబరుచిర
కనకసౌధాదికంబులు గడచి మిగుల, మోదమున రాజశుద్ధాంతమునకు నరిగి.

54