పుట:రుక్మిణీపరిణయము (కూచిమంచి తిమ్మన).pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

జగములలో నీ వుందువు, జగములు నీయందు నుండు సర్వము నీమూ
ర్తిగ భావించి మెలంగెడు, సుగుణుల కెప్పుడును నీవు సులభుఁడ వీశా.

35


తే.

ఉరిడెపురు గెల్లవేళల బురదలోనె, పొరలుచుండియుఁ బంకంబుఁ బొందనట్లు
జ్ఞాని యగువాఁడు సంసారసంగుఁ డగుచు, నెందు నేనియుఁ బంకంబుఁ జెందఁ డభవ.

36


చ.

కలల సమస్తస్తువులు గాంచినఁ దథ్యము గానికైవడిన్
మెలఁగుప్రపంచ మంతయును మిథ్య యటంచుఁ దలంచి యాత్మయం
దలరఁగ నిన్నుఁ గన్గొనుమహాత్ములు నిత్యవిభూతిఁ జెంది ని
శ్చలసుఖలీలఁ దేలుదురు సారతపోధన లోకకారణా.

37


ఉ.

జ్ఞానవిహీనమానవుఁడు శాస్త్రము లెన్ని యెఱింగినన్ మిముం
గానఁ డొకించుకేనియును గాసర మేక్రియ విద్య నేర్చినన్
మేను మఱెంతదొడ్డయిన మిక్కిలి నేరుపు విస్తరిల్లఁగా
మ్రా నెగఁ బ్రాఁకి పండ్లు దినుమార్గ మెఱుంగునె చీమకైవడిన్.

38


తే.

జలఘటాదులయం దబ్జసారసాప్త, బింబములు పెక్కు లగుచుఁ గాన్పించుభంగి
నిక్కముగ దేహులకునాత్మ యొక్కఁ డయ్యుఁ, బెక్కుదెఱఁగులఁ గనఁబడుఁ బృథివి నీశ.

39


క.

కర్మములఁ దవిలి కొందఱు, నిర్మలపరసౌఖ్య మెఱుఁగనేరక యెపుడున్
దుర్మతిఁ జెడుదురు వారల, కర్మంబుల కేది మేర గలదు మహేశా.

40


తే.

అనుచుఁ దననేర్చుతెఱఁగున నభవుఁ గొల్చి, యచ్చోటు దొలంగి యరుగుచు నందునందు
వింతలెల్లను గనుఁగొని సంతసిలుచు, ద్వారకాపురి వేవేగఁ దఱియఁజేరి.

41


క.

ధరణీసురాగ్రగణ్యుఁడు, పరమానందమునఁ గాంచె బహుతరమణిగో
పురమున్ వైభవజితగో, పురమున్ బావనవిభేదిపురముం జెంతన్.

42


ఉ.

కాంచి పురంబుఁ జేరి మణికల్పితశిల్పకచాతురీకళా
భ్యంచితసౌధయూధరుచిరాకరసారరథాదికంబులుం
గాంచనగోపురంబులు సుఖప్రదవిప్రధరేశగేహముల్
కాంచనగర్భవంశమణి కన్నులపండువు గాఁగఁ జూచుచున్.

43


సీ.

నీలజాలకజాలనిష్క్రాంతకౌశికఘనసారధూపవాసనలచేత
నిరతభరతకళాపరవారయువతీమృదంగసంగీతనాదములచేత
నానాప్రసూనగంధానుసంధానసమాగతగంధవాహములచేత
జంద్రశాలాప్రదేశస్ఫురజ్జలయంత్రపతితశీకరకదంబములచేత


తే.

ద్వారతోరణకుముదకల్హారసార, సారసామోదములచేత ధీరవరుఁడు
మార్గగమనప్రభూతశ్రమంబు దీఱి, యుల్లమున మొల్ల మగువేడ్క లుల్లసిల్ల.

44


సీ.

మఖహోమనిఖిలాగమప్రణాదములచే భాసిల్లుభూసురావాసములును
గరిఘోటకాందోళికాశతాంగములచే వెలుఁగొందుభూభ్ళన్నివేశములును