పుట:రుక్మిణీపరిణయము (కూచిమంచి తిమ్మన).pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

తాపోద్రేక మొనర్పకున్న నిజవిద్యాభంగమా భృంగమా
కోపాటోపముఁ జూపి యేఁచెదవు నీకున్ వైరమా కీరమా
పాపం బెన్నక సాధుకోటి నలయింపం గోరికా శారికా
కాపట్యం బిఁక మాను మన్యభృతమా కాదంబసంఘాతమా.

127


తే.

అనుచుఁ దనచుట్టుఁ గ్రమ్మి గయ్యాళితనము, లలరఁ జెలరేఁగి కడుహళాహళి యొనర్చు
చెఱకువిలుకానిబలములఁ దఱిమి పలికి, కలికి మదిలోన వగల నాక్రాంత యగుచు.

128


చ.

ఉసు రసు రంచు వేసరిలు నూరుపుగాడ్పుల నించు నూరకే
కసరుకొనున్ దిశల్ వెదకుఁ గన్గవ మూయు విధిం దలంచు సా
రసదళనేత్రు నెన్నఁడు తిరంబుగఁ గాంచెద నంచు నెంచు వె
క్కస మగుమన్మథానలశిఖావిసరంబులఁ గ్రాఁగి లోఁగుచున్.

129


తే.

మఱియు గుఱిలేని విరహార్తిఁ బొరలుచుండి, యంబురుహపత్రనేత్ర డెందంబునందు
సకలసంతాపశాంతిహేతుక మటంచు, హరిపదధ్యానలాలస యగుచుఁ బలికె.

130


ఉ.

గోపవధూకుచప్రచురకుంకుమసంకుమదాదికాధికో
ద్దీపితముల్ నవీనతరదీధితిజాలవిశాలరత్నసం
స్థాపితహేమనూపురవితానఝణంఝణరాగశోభన
ప్రాపకముల్ ముకుందమృదుపాదసరోరుహముల్ దలంచెదన్.

131


చ.

అరుదుగ రాధికాకిసలయాధరఁ గూడి కళిందనందనీ
పరిసరమంజుకుంజగృహభాసురపల్లవతల్పకల్పిత
స్మరసరసక్రియావిహితచాతురిఁ గేరెడువల్లవీమనో
హరునివిలాసవైఖరు లహర్నిశమున్ బ్రణుతింతు వేడుకన్.

132


సీ.

నవమోహనాకారు నతజనమంచారు తరలముక్తాహారు దురితదూరు
సౌవర్ణమయవాసుఁ జంద్రికానిభహాసుఁ గరుణారసోల్లాసు ఘనవిలాసు
ముఖకాంతివిజితేందు మునిమనోజ్ఞమిళిందు సూరిజనానందు సుగుణబృందు
వికచసారసనేత్రు సకలలోకపవిత్రు సతతసజ్జనమిత్రు నుతచరిత్రు


తే.

నరితమోహంసుఁ గేకిపింఛావతంసు, హరిమణిశ్యాము వనమాలికాభిరాము
నసురకులభంగు గోపకన్యాభుజంగు, మహితబృందావననిశాంతు మదిఁ దలంతు.

133


మ.

తళుకుంబంగరుబొంగరా లనుచు నాత్మం బొంగి కెంగేల లేఁ
గులుకుంబ్రాయపుగొల్లగుబ్బెతలచన్గుబ్బల్ బిగంబట్టి కెం
దలిరుంగైదువుజోదుకేళికిఁ బ్రయత్నం బింపుతోఁ జేయుచుం
బలుచందంబులఁ గేరుచెల్వుని మదిన్ భావింతు నత్యంతమున్.

134


క.

కుందనపుటందె లడుగుల, నందంబుగ ఘల్లుఘల్లు రని మ్రోయఁ గడున్
నందయశోదలముందరఁ, జిందులు త్రొక్కెడుమహాత్ముచెలువు నుతింతున్.

135