పుట:రుక్మిణీపరిణయము (కూచిమంచి తిమ్మన).pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

పుడమిచేడియ యాపువ్వుఁబోణిగర్భ, మునఁ బ్రవేశించుచున్నదో జననమొందఁ
దలఁచియన మన్నురుచియంచుఁ దవిలి మెసఁగెఁ, గానిచో నింతి కది యేమి కారణంబు.

67


క.

అడు గామడయై తోఁచెను, నడచునెడం దృణము మేరునగమై తోఁచెం
దొడరి పనిసేయు నెడ న, ప్పడఁతికి గణుతింప గర్భభారము పేర్మిన్.

68


చ.

తలఁపునఁ గోరికల్ మొలచెఁ దద్దయు దేహము డస్సె గుబ్బ చ
న్నులు కడు నుబ్బె నారు సుమనోవరనీలరుచిం జెలంగెఁ
బొక్కిలి మఱి విస్తరిల్లెఁ బలుగెంపులసొంపుహసించుమోవియున్
వెలవెలఁ బాఱె నప్పు డరవిందదళాయతచారునేత్రకున్.

69


క.

అలినీలవేణి కిటువలె, నెల లలరఁగఁ దొమ్మిదియును నిండి తగం బ్రొ
ద్దులనెల మసలుటయును ని, ర్మల మగునొకపుణ్యవాసరంబున నంతన్.

70


క.

కలశాబ్ధివీచిలక్ష్మీ, లలనం గన్నట్లు మంచిలగ్నంబున సొం
పలరఁగ నజ్జలజానన, కులదీపక యైనముద్దుఁగూఁతుం గనియెన్.

71


తే.

పుట్టినప్పుడె కలిచల్లి బొడ్డుగోసి, నడి జలక మార్చి తడియొత్తి బడిసివైచి
మంత్రసానులు బాలికామణినిఁ బ్రేమ, దనర మెత్తనిపొత్తుల నునిచి రొగిని.

72


క.

పాలకడలిక్రియ నజ్జన, పాలకసదనంబు మెఱసెఁ బలుమఱు రోలం
బాలకయై విలసిల్లెడు, బాలకతన శుభవిభావిభాసిత మగుచున్.

73


ఉ.

అప్పుడు మానవేంద్రుఁడు ధరామరకోటి కభీష్టవస్తువుల్
కుప్పలుగాఁగ నిచ్చి కరిఘాటకహాటకచేలముల్ నయం
బొప్పఁగ బంధువర్గముల కున్నతలీల నొసంగి దీనులం
దప్పక సత్కృపం గని యథావిధిఁ దానములాడి వేడుకన్.

74


తే.

పదిదినంబులు పురిటింటఁ బగలు రేయుఁ, బదిలముగఁ గాపులిడి నరపాలుఁ డంత
పురుడు చేయించెఁ దనతోడఁ బురుడు సేయఁ, గలరె నృపతులు ధారుణీస్థలి నటంచు.

75


క.

జనులెన్నఁ బదునొకొండవ, దినమున బుధనికరమెల్ల దీవన లొసఁగం
దనయనుఁగుందనయకు వే, డ్కను రుక్మిణి యనుచు నామకరణం బిడియెన్.

76


తే.

నూనెఁ దలయంటి పసుపున మేను నలఁచి, చలువపన్నీటితోఁ గూర్చి జలకమార్చి
కజ్జలంబిడి ధూపముల్ కడునొసంగె, పాలు ద్రావించి బాల నుయ్యాల నునిచి.

77


క.

జోజో ముద్దులగుమ్మా, జోజో కపురంపుదిమ్మ జోజో కొమ్మా
జోజో బంగరుబొమ్మా, జోజో వెలలేని సొమ్మ జోజో యనుచున్.

78


తే.

జోలవాడంగ నిదురించి మేలుకాంచి, మేలుకాంచనకింకిణీజాలములు న
టించఁ బదములుఁ జేతు లాడించుకొనుచుఁ, బోరువెట్టిన నెఱిఁగి యాహార మొసఁగి.

79


ఉ.

అత్తఱిఁ గ్రొత్తముత్తియపుహర్మ్యతలంబున నిల్పి బిత్తరుల్
పుత్తడికీలుబొమ్మలును బొంగరముల్ మణికందుకంబులుం