Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామాయణ విశేషములు 39

వర్గమువారి అభిప్రాయములో రామాయణ మూలకథ క్రీ.పూ. 500 కంటే ముందుగానే రచింపబడెను. అటుతర్వాత క్రీ.పూ. 200 నుండి దానిలో చాలా భాగాలను పెంచుచు వచ్చిరి. ఈ అభిప్రాయమును “మెక్డోనెల్” గారు తమ “సంస్కృత వాఙ్మయ చరిత్ర" అను ఆంగ్ల గ్రంథములో వెలిబుచ్చిరి.

రమేశచంద్రదత్తుగారు ఇట్లభిప్రాయ పడినారు: "రామాయణ మూల రూపగ్రంథము ఎప్పుడు రచింపబడెనో చెప్పుటకు వీలులేదు. సూత్రవాఙ్మయములో మహాభారత సూచనలున్నవిగాని రామాయణమును గురించి యేమియు కానరాదు. కీ. పూ. 500 ప్రాంతములో విజయుడను వంగరాజు సింహళద్వీపమును జయించెను. అయితే సింహళము ఆర్యులకు అంతకంటె చాలాకాలానికి పూర్వమే విదితమైయుండెను. వింధ్యకు దక్షిణమున ఆటవికు లుండిరి. కోతులే విశేషముగా నుండెను. ఈ దక్షిణ భాగములో ఆర్యనాగరికత వ్యాపించినట్లు రామాయణములో తెలుపలేదు. ఈ కారణాలచేత రామాయణము పౌరాణిక యుగముయొక్క తుది భాగములో రచింపబడియుండును."* పౌరాణిక యుగము రమేశచంద్ర దత్తు యభిప్రాయ ప్రకారము క్రీ. పూ. 1400 నుండి క్రీ.పూ. 1000 వఱకు వ్యాపించియుండెను.

రమేశచంద్రదత్తుగారు ఒక్క యంశాన్ని బాగా కనిపెట్టినారని తోచుచున్నది. రామాయణములో శ్రీరాముని విష్ణ్వవతారముగా వర్ణించినారు. కాని దత్తుగారి అభిప్రాయములో విష్ణు వప్పటికి పౌరాణికులలో ప్రాధాన్యమునకు రాలేదు. ఇంకను ఇంద్రునకే ఆధిపత్య ముండెను. అట్టి యాధిపత్యమును శ్రీకృష్ణుడు తొలగించెను అని దత్తుగారు వ్రాసి దానికి సహకారముగా పారస్కరగృహ్యసూత్రములో (2-17-9) నాగేటిచాలు దేవత అనగా “సీత” ఇంద్రుని భార్యగా వర్ణింపబడినదని వ్రాసినారు.

  • Early civilization of India by R. C. Dutt, Vol II