Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామాయణ విశేషములు 35


శ్రీరాముని కథలు భారతాది పురాణాలలోను, ఇతర గీర్వాణ గ్రంథములందును కలవు. అందు కొన్నింటిలో నుండు విశేషములను మాత్రము సంగ్రహముగా సూచింతును.

1. కథాసరిత్సాగరము

దీనిని పైశాచీ భాషలో గుణాఢ్యుడు రచించెనందురు. అదిప్పుడు లభించుటలేదు. క్రీ. శ. 1100 ప్రాంతమందు కాశ్మీరమును హర్షదేవుడను రాజు పాలించెను. ఆ కాలమందచ్చట నుండిన సోమదేవుడను నాతడు దీనిని సంస్కృతములో రచించెను. అతడా గ్రంథాదిలో నిట్లు ప్రతిజ్ఞ చేసెను: “ఇది మూలమైన పైశాచీ బృహత్కకథకు సరిగా నుండును. ఇంచుకైనను అతిక్రమింపదు.” మూలగ్రంథము క్రీ. పూ. 200 ఏండ్ల ప్రాంతమందు రచితమని తెలిపినాను. కావున క్రీస్తుశకాదికాలమందో అంతకు పూర్వమో రామాయణ కథ జనులం దెట్టిరూపమున వ్యాపించెనో కొంత తెలుసుకొనవచ్చును. అందుచేత శ్రీ వేదం వెంకటరాయశాస్త్రిగారి తెనుగు సేతనుండి యీ క్రిందివి ఉదాహరించుచున్నాను.

“తొల్లి అయోధ్యాపతియైన దశరథుని కొమరుడు భరత శత్రుఘ్న లక్ష్మణుల యన్న శ్రీరాముడు ఉండెను. ఆయన రావణుని పరిమార్చుటకు అవతరించిన విష్ణువు. తండ్రి విధివియోగమున సీతాలక్ష్మణులతో అడవికి బంపెను. అచట రావణుడు మాయచే సీతను హరించి, దారిలో జటాయువును సంహరించి ఆమెను లంకకు గొనిపోయెను. రాముడు వాలి వధచే సుగ్రీవుని వశపరుచుకొని యాంజనేయునిబంపి యామె వృత్తాంతమును తెలిసికొనిపోయి సముద్రమున కానకట్టగట్టి రావణుని సంహరించి లంకారాజ్యము విభీషణునికిచ్చి సీతను గైకొనిపోయెను.