ఇతర రామకథలు
కాళిదాసు రఘువంశములో శ్రీరామునికథ నెత్తుకొన్నాడు. కాళిదాసుని కాలము క్రీ. పూ. 55 నుండి క్రీ. శ. 450 మధ్యన అని విమర్శకులు రెండు మేరలకు వచ్చినారు.
జైనరామాయణ మొకటికలదు. అదియు క్రీస్తు శకాదియందు రచితమైయుండును. రామాయణము జైనమతవ్యా ప్తికాలమందు జనాదరణ మందిన సుప్రసిద్ధ కథయగుటచేత జైనులును దానిని తమ మతవ్యాప్తి కనుకూలపరచుకొన్నట్లున్నది.
పాణినికిని, అశ్వలాయనునికిని పూర్వము మహాభారత కథామూలముండెననియు, రామాయణ మపుడున్నది లేనిది నిర్ణయించుటకు వీలులేదనియు, ఆర్. జి. భండార్కరుగారు దక్కన్ ప్రాచీనచరిత్రలో వ్రాసిరి. పాణినిలో కృష్ణాదుల పేరులు కలవు కాని యెచ్చటను శ్రీరాముని పేరు కానరాదనియు విమర్శకులందురు. పాణిని క్రీ. పూ. 600 లో నుండెనని కొందరు, 500లో నుండెనని మరికొందరందురు.
కథా సరిత్సాగరమును గుణాఢ్యుడు శాలివాహనుని కాలమందు అనగా క్రీ. పూ. 200 ప్రాంతమందు రచించెను. అందు రామాయణ కథా సారమున్నది. అయితే గుణాఢ్యుని పైశాచీక లుత్సన్నములై మన కిప్పుడు లభ్యముకావు. సోమదేవుడు కథా సరిత్సాగరమును సంస్కృతములో రచించెను. కాళిదాసు, సోమదేవుడు మున్నగువారికి తెలిసినరామకథ యెట్టిదో ఆ కథలు మన కిప్పుడు లభ్యమగు వాల్మీకి రామాయణకథతో నెందెందు భిన్నించినవో తెలుసుకొనుటకు వాటిని సంగ్రహముగా నిం దుదాహరింతును.