Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

రామాయణ విశేషములు

దిద్దినను అసభ్య దూషణలు, అన్నచెల్లెండ్ల వివాహములు, శవాల వస్త్రాపహరణములు, విషదిగ్ధమగు బాణాల ప్రయోగము, ఇఫిజీనియా వంటి నరబలులు - ఇట్టి వెన్ని యో యింకను ఇలియడులో నిలిచి పోయినవి. హోమరు కవియే రామాయణగాథను అడ్డదిడ్డిగా విని దాని వంటి ఘట్టాలు కలిగినట్లు కనిపించిన ట్రాయి యుద్ధాన్ని పురాణముగా వ్రాసినట్లు కనబడుచున్నది. అయితే రామాయణగాథ క్రీ.పూ. 800 లేక 900 ఏండ్ల క్రిందట గ్రీసువంటి దూరదేశమునకు వ్యాపించిపోయెనా ? అని శంకింపవచ్చును.

ఒక్క రామాయణ మేమిటి? హిందువుల గాథలు, వారి కళలు, అశ్వశాస్త్రాలవంటి శాస్త్రములు, వైదిక దేవతలు ఇవన్నియు గ్రీసువరకు క్రీస్తునకు పూర్వము రెండు మూడు వేలయేండ్ల క్రిందటనే వ్యాపించి యుండెను. ఎట్లనగా గ్రీకు దీవులకు సమీపమందే సిరియా అను దేశమున్నది పూర్వములో అచ్చటనుండిన మండలాన్ని హట్టిదేశమనిరి. అచ్చట బోఘాజ్‌క్వీ (Boghazkuei) అను నగర ముండెను. దానికి తూర్పున టైగ్రస్ యూఫ్రటీసు నదులమధ్య మిటన్నీ అను దేశ ముండెను. అది యిప్పటి మెసపొటోమియాలోని మండలము. హట్టి రాజు మిటన్నీ రాజుతో క్రీ. పూ. 1380 లో ఒక సంధి చేసుకొనెను. దానిని శాసనముగా చెక్కించిరి. ఆ సంధికి సాక్షులుగా మిత్ర, వరుణ, ఇంద్ర, నా సత్య దేవతలు పేర్కొనబడినారు. జోఘాజ్‌క్వీలోని దిబ్బలలో కొన్ని శాసనాలు దొరికినవి. వాటిపై అశ్వశాస్త్రసూత్రములను వ్రాసినారు. ఐకవర్తన, తిర ((త్రి) వర్తన, పంజ (పంచ) వర్తన, షట్ట (షష్ఠ) వర్తన, అను నడకలను గుర్రాలకు నేర్పించవలెనని అందు వ్రాసినారు. ఈ పదాలు సంస్కృతభాషలోనివి. సిరియా పాలస్తీనా ప్రాచీనరాజుల పేరులు సంస్కృతనామములతో కూడియుండెను. అర్తతమ (ఋతతమ), తుష్రత, సుబంధు అనునవి కొన్ని పేరులు.