Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxxviii


పరశురామునితో యుద్ధము చేసిన భీష్ముఁ డాతనికిఁ దొలుత శిష్యుఁడు. ఈ గురుశిష్యుల యుద్ధమునాఁటికి పరశురాము డస్త్ర త్యాగము చేసి మహేంద్రపర్వతమునం దపస్సు చేయుచుండినట్లు భారతము చెప్పు చున్నది. మహారామాయణముసైత మట్లే పరశురాము డస్త్రసన్యాసము గావించిన పిమ్మటనే రామపరీక్షార్థము తద్వివాహానంతరము మార్గమునం దతని సంధించినట్లు చెప్పుచున్నది.

ఇట్టి వెన్నియో సమాచారములు రామాయణ మహాభారత కథా నాయకుల సన్నిహితకాలీనతను దెలియఁజేయుచున్నవి.


రామాయణ మహాభారతములలోని కథా సాదృశ్యములు

1

రామకథ మహాభారతములోని యరణ్యపర్వమునందేకాక సభా పర్వమునందలి యధిక పాఠభాగములోగూడ నున్నది. దానిని వదలినను ద్రోణ శాంతిపర్వములయందలి షోడశరాజోపాఖ్యానముల రెంటియందును నొకచోటఁ గొంత సంగ్రహముగను వేఱొకచోటఁ గొంత విస్తారముగను గన్పట్టుచున్నది.

2

శల్యపర్వమునందలి బలరామతీర్థయాత్రా ఘట్టమున శ్రుతావతి యను భరద్వాజపుత్రిక మానవులఁ బెండ్లాడనొల్లక యింద్రుని గోరి తపస్సుచేసి యగ్ని ప్రవేశమున నిష్టార్థము సాధించినట్లు గలదు. రామాయణోత్తర కాండమునందు వేదవతియను (బృహస్పతి పౌత్రికయుఁ గుశధ్వజుని పుత్రికయునైన యొక) కన్య యుపేంద్రుని బెండ్లాడఁ గోరి తపస్సు చేయుచు రావణునిచే నవమానింపఁబడి యగ్ని ప్రవేశము చేసి మఱుజన్మమున సీతయై పుట్టినట్లున్నది. ఇందు శ్రుతావతీ వేదవతీ