Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxvi


“రామాయణ విశేషములు" అని తమ యీ పొత్తమునకుఁ బేరిడుటలో నేయే యుద్దేశములు వారి హృదయములో నుండెనోయవి దీని సాంగోపాంగముగాఁ జదువఁగల సహృదయులకు సాధారణముగాఁ దెలియవచ్చెడివియే యై యున్నవి. కావున వానిని నే నీ పీఠికలోఁ బ్రత్యేకము జ్ఞప్తిచేయనవసరము లేదనుకొనియెదను. శ్రీ పెండ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రిగారు తమ పీఠికలో వివరించినట్లు రెడ్డిగారు బహుభాషాకోవిదులు. వారికి సాధ్యమైన విమర్శనఫక్కి నాఁబోటివారికి సాధ్యముగాదని నేనును బాఠకులకు మనవిచేయుచున్నాను. గ్రంథ పునర్ముద్రణమున వారు సవరించుకొనఁదలఁచిన యనేక విశేషములు క్రోడీకృతములు గాకముందే నిర్దయదైవము నా ప్రియమిత్రుని మనకు దూరము చేసినది.

రామాయణక థావిషయమున నేను ప్రత్యేకించి చెప్పవలసిన యొకటి రెండు ముఖ్యవిశేషము లీ పీఠికలోఁ దెలియఁజేయుచున్నాను.

శ్రీమద్రామాయణము రామునికాలముననే రచింపఁబడినదని నమ్మించు ప్రయత్నము దాని యుపోద్ఘాతమునందే చేయఁబడినది. దీనిని రెడ్డిగారు బాగుగాఁ బరికించి యందలి యసంగతములను జూపుచు మూల మెంతవఱకుఁ బ్రక్షిప్త మెంతవఱకునని బహుముఖములఁ జర్చించి యున్నారు. వారు పునర్ముద్రణమున సవరించికొనఁబూని వ్రాసియుంచుకొన్న కొన్ని లేఖనములవలన నీ గ్రంథవిస్తరము క్రీస్తుశకమున కీవలఁ గూడ విరివిచేయఁబడుచువచ్చినదని వారు విశ్వసించినట్లు మనకుఁ దెలియవచ్చుచునేయున్నది. ఈ విషయములో నేను వారితో నెల్లవిధముల నేకీభవించుచున్నాను. ఇట్టి యీ మహా గ్రంథమువలన శ్రీరామచంద్రుని దేశకాలవిశేషముల స్వరూపనిర్ణయము చేయఁబూనుట సామాన్యముగా దుర్ఘటము గదా! అనుష్టుప్ఛందమున నున్న శ్లోకము లన్నియుఁగాని యం దనేకములుగాని ప్రథమకవివై యుండునను నూహసైతము సోపపత్తికముగా నున్నదని నేను తలంపను.