Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మలికూర్పు పీఠిక

నా ప్రియమిత్రులు కీ. శే. సురవరము ప్రతాపరెడ్డిగారు 'రామాయణ విశేషములు' అను నీ విమర్శన గ్రంథమును రచించి దాని ప్రథమ ముద్రణమును గావింపించి ప్రకటించియున్నారను విషయము సుప్రసిద్ధము. వారి యీ రచనాకాలమున కెంతో పూర్వమునుండియే మాకు సుఘటితమును సౌభ్రాత్రతుల్యమునైన గాఢమైత్రియున్నను దత్ప్రథమ ముద్రణానంతరము ప్రతి యొకటి పంపఁబడువఱకును వారి రచనోద్దేశముగాని, తత్పూరణముగాని తెలిసికొను నవకాశము నాకుఁ గలిగినదికాదు.

తరువాత మాత్రము మేము పలుమాఱు గలియుటయు గ్రంథస్థ విషయములను జర్చించుటయుఁ బ్రాయికముగా సంభవించుచుండెడిది. అందుఁ బరస్పర భిన్నాభిప్రాయములైన సందర్భములలోఁ బునర్ముద్రణమున నా యా విశేషములు వ్యక్తీకరింపఁబడునను నమ్మిక నాకు వారు గలిగించుచుండెడివారు. మొత్తము మీదఁ జారిత్రక విషయములలో ననేకములు నాకు నచ్చినవియే యై యున్నవి.

ఈ గ్రంథాదిని గానవచ్చు కీ. శే. చిదిరెమఠము వీరభద్రశర్మగారి యొక్కయు, కీ. శే. పెండ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రిగారి యొక్కయు బీఠికలను జూచువారికి రెడ్డిగారి గ్రంథరచనా ప్రకటనములలో నెంతెంతటి ప్రతిఘటనముల నెదుర్కొనవలసివచ్చెనో తెలియవచ్చుచునే యున్నది. ధీరులైన రెడ్డిగారు వానిని లెక్కింపక తమ కార్యమును దాము కొనసాగింపఁగలిగిరనుట యెంతయు గమనార్హమయిన విశేషము.